రాజన్న సిరిసిల్ల, జూన్ – 12
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై హౌసింగ్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఏఈలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు.
ముందుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై మండలాల వారిగా సమీక్ష చేశారు. జిల్లాలో ఇప్పటిదాకా మొత్తం 7,367 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని వెల్లడించారు. 5,798 ముగ్గు పోశామని, 5,014 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో, 4,362 ఇండ్లు గోడల లెవెల్ లో, 4,012 స్లాబ్ లెవెల్ లో, 2,834 ఇండ్లు పూర్తి అయ్యాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
ముగ్గు పోసిన వారికి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు, అక్కడి నుంచి స్లాబ్ లెవెల్ కు, తుది దశ పనులు పూర్తి చేసేలా.. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ.. పనులు వేగంగా పూర్తి చేసేలా చూడాలని సూచించారు.
ప్రతి ఎంపీడీఓ ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని పరిశీలించాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో
సమావేశం కావాలని మండలానికి కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి.. ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
లబ్దిదారులకు ఇటుకులు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా.. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. మేస్త్రీలు, వడ్రంగి ఇతర పని వారి వివరాలు లబ్ధిదారులకు అందుబాటులో పెట్టి ఇబ్బందులు దూరం చేయాలని సూచించారు. లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో గ్రామీణ ఉపాధి హామీ పనులు వినియోగించుకునేందుకు అవకాశం ప్రభుత్వం కల్పించిందని, సద్వినియోగం చేసుకునేలా చూడాలని ఎంపీడీఓలు ఆదేశించారు. పురోగతిలో ఉన్న ఇండ్ల ఫోటోలు ఎప్పటికప్పుడు హౌసింగ్ ఏఈలు ఆన్లైన్ లో అప్ లోడ్ చేయాలని, లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతి డబ్బు జమ అవుతున్నాయని వెల్లడించారు. ఇండ్ల నిర్మాణాలకు ఎక్కడా ఇసుక కొరత లేదని స్పష్టం చేశారు.
సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.