రుద్రంగి, జూన్ - 10
ప్రతి ఇంటిలో చెత్తను నాలుగు రకాలుగా పక్కాగా వేరు చేయాలని, పారిశుధ్య వాహనాలకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రుద్రంగి మండలం మానాలలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత, పంటల మార్పిడి, వ్యవసాయ, బడి బాట, ఘన వ్యర్థాల నిర్వహణ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, పారిశుద్ధ్యం, వన మహోత్సవం, ఆయిల్ పామ్, రోడ్డు భద్రత, నియమాలు, గిరిజన సంక్షేమ శాఖ పథకాలు తదితర అంశాలపై గ్రామ ప్రజలతో సుదీర్ఘంగా చర్చించి అవగాహన కల్పించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ .. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మార్చి 6వ తేదీన ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా 10 థీమ్ లతో 10 శాఖల ఆద్వర్యంలో వివిధ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, సంపూర్ణ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
వర్షాకాలానికి ముందే గ్రామాల్లోని డ్రైనేజీలు శుభ్రం చేయించాలని తెలిపారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని కోరారు. ఘన వ్యర్థాల నిర్వహణ -2026 పై ప్రజలు కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని, చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయాలని సూచించారు. తడి, పొడి, సానిటరీ, ప్రత్యేక చెత్త గా వేరు చేసి గ్రామ పంచాయతీ వాహనానికి అందించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్వహణపై అవగాహన పొందాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో గ్రామస్థులను సెగ్రీగేషన్ షెడ్లకు తీసుకు వెళ్లాలని సూచించారు. నీటి ట్యాంకులను నెలకు మూడు సార్లు బ్లీచింగ్ తో సిబ్బంది శుభ్రం చేయాలని ఆదేశించారు.
పంటలు సాగు చేసేముందు వ్యవసాయ అధికారులను సంప్రదించి, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే ఇబ్బందులు ఉండవని వివరించారు. ఆయిల్ పామ్, సన్న వడ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు తదితర లాభదాయక పంటలను సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలని సూచించారు. ఆయిల్ పామ్ కు సంబంధించి సిద్దిపేట జిల్లా నర్మెట లో పరిశ్రమ ఉందని, పండించిన దిగుబడిని పరిశ్రమకు తీసుకువెళ్ళడానికి దూర భారం కూడా లేదని గుర్తు చేశారు. పంట మార్పిడి చేయకపోతే నేల సారం తగ్గుతుందనే విషయాన్ని రైతులు గమనించాలని పేర్కొన్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే బీఎల్ఓలకు ప్రజలు సహకరించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ నెల 25 వ తేదీ నుంచి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమన్నారు. గుర్తింపు కార్డులు చూపించి మ్యాపింగ్ ప్రక్రియకు సహకరించాలని కోరారు.
బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పంపించాలని కోరారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు.
గిరిజన సంక్షేమశాఖ ఆద్వర్యంలో యువతకు మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సులలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తున్నారని, 18 నుంచి 35 ఏండ్ల లోపు వారు పూర్తి వివరాల కోసం గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. యువత శిక్షణను సద్వినియోగం చేసుకొని.. ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు.
పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు నిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలని ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటుతూ.. సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామస్థులందరికీ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్
మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మానాల గ్రామస్థులంతా ప్రభుత్వ బడికి కే పిల్లలను పంపిస్తామని తీర్మానించడంపై అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి చేస్తానని, ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, ప్రవేశాలు పెరగాలని పేర్కొన్నారు.
మానాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. మొక్కలు నాటాలని.. పచ్చదనం పెంచాలని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా లో ఇబ్బందులు దూరం చేయాలని, భూ సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధి పనుల కోసం స్థానిక వనరుల నుంచి ఇసుక తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. స్థానిక తాగునీటి సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ చేస్తున్న కృషిని అభినందించారు. మారుమూల గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభ నిర్వహణ పై హర్షం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసాచారి, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సంగీత, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్, వివిధ గ్రామాల సర్పంచులు, మిషన్ భగీరథ, పోలీస్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.