రాజన్న సిరిసిల్ల, జూన్ -09
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కింద 99 రోజుల కార్యాచరణలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీ డీఆర్‌సీ (డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్) కేంద్రంలో సాలిడ్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు –2026 అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారి నూతన సాలిడ్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ముఖ్యాంశాలను వివరించారు. అనంతరం డీఆర్‌సీ కేంద్రంలో జరుగుతున్న వ్యర్థాల నిర్వహణ ప్రక్రియలను అధికారులకు ప్రత్యక్షంగా చూపిస్తూ క్షేత్రస్థాయి అవగాహన కల్పించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వ్యర్థాల నిర్వహణలో భాగస్వామయ్యే అన్ని శాఖల అధికారులు కంపోస్ట్ షెడ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలు, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలు అనే నాలుగు విభాగాలుగా వ్యర్థాల వేరు చేయడాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. అలాగే బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారులను గుర్తించి నిబంధనల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నూతన సాలిడ్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల అమలులో నిర్లక్ష్యం లేదా ఉల్లంఘనలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ శ్రావణ్, స్వచ్ఛ భారత్ మిషన్ ఐఈసీ కన్సల్టెంట్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల వార్డు అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.