రాజన్న సిరిసిల్ల, జూన్ -09
ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని, హమాలీల సంఖ్యను పెంచి, అన్ లోడింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్దాపూర్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాముల్లో ధాన్యం అన్ లోడింగ్ చేస్తున్న తీరును అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
వాహనాల్లోని ధాన్యం హమాలీల సంఖ్యను మరింత పెంచి అన్ లోడింగ్ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని, అన్ లోడ్ అయిన వాహనాలను ధాన్యం లోడింగ్ కోసం ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాముల్లో ధాన్యం నిల్వ చేస్తున్న తీరు, గోదాముల సామర్థ్యం వివరాలను అధికారులను అడిగి ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాల నుండి వాహనాలను జాప్యం చేయకుండా లోడింగ్ చేసి తరలించేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సందర్శనలో పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, సిరిసిల్ల, వేములవాడ తహసీల్దార్లు మహేష్, జయంత్ తదితరులు ఉన్నారు.