రాజన్న సిరిసిల్ల, జూన్ -08
నక్ష (నేషనల్ జియో స్పాషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హాబీటెషన్స్) సర్వే ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు.
నక్ష సర్వే పురోగతి తదితర అంశాలపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ మాట్లాడి.. సర్వే ఎక్కడి వరకు పూర్తి చేశారో ఆరా తీశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ.. కేంద్ర సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నక్ష కింద దేశంలోని 150 అర్బన్ లోకల్ బాడీస్ ను ఎంపిక చేశారని వెల్లడించారు. రాష్ట్రంలోని 10 మున్సిపాలిటీలు ఎంపిక చేశారని తెలిపారు. జూలై నెలాఖారులోగా మొత్తం సర్వే ప్రక్రియ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పకడ్బందీగా పూర్తి చేయిస్తాం
వేములవాడ మున్సిపల్ పరిధిలో నక్ష కార్యక్రమం కింద ఐదు విలీన గ్రామాల్లో కలిపి మొత్తం 307 బ్లాక్స్ ఉన్నాయని, ఇప్పటివరకు 49 పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. 14, 984 ఇండ్లు ఉండగా, 6707 ఇండ్ల సర్వే పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్క ఇంటి సరిహద్దులు, ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, ఇతర ఖాళీ స్థలాల విస్తీర్ణం వివరాలు పకడ్బందీగా పూర్తి చేయిస్తామని వివరించారు.
కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ అఫ్ సర్వే శ్రీనివాస్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ లోకేష్, టీపీఓ అన్సార్ తదితరులు ఉన్నారు.