జూన్ 05
జనగామ
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు.
శుక్రవారం, జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి, వెల్ది, ఖిలాషాపూర్, మండలగూడెం, అలాగే నర్మెట్ట మండలంలోని మచ్చుపాడ్, నర్మెట్ట, అదే విధంగా చిల్పూర్ మండలంలోని చిల్పూర్, నష్కల్ గ్రామ పంచాయతీల పరిధిలో గల ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతుల వద్ద నుంచి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ధాన్యం తడిచిందా? ఇంకా ఎంత ధాన్యం కాంటా వేయాలి? కల్లాల్లో ఇంకా ఎంత ధాన్యం ఉంది? అని ఆరా తీశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తూకం సరిగా చేస్తున్నారా? అని ఆరా తీశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకూడదని, ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి, తూకం చేయించాలని నిర్వాహకులను ఆదేశించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే నిర్దేశిత మిల్లులకు తరలించాలని, అదనపు లారీలు, ట్రాక్టర్ లు సమకూర్చుకోవాలని, హమాలీల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మిల్లుల వద్ద సకాలంలో అన్‌లోడింగ్ చేసుకునేలా చూడాలని సూచించారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులు తొందరపడి ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని విజ్ఞప్తి చేశారు.
రాత్రి, పగలు పని చేసి ధాన్యం సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు అకాల వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడం అత్యవసరమని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు సరిపడా ఏర్పాటు చేయాలని చెప్పారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా, సత్వరంగా పూర్తి చేయాలని సూచించారు.
రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని, కేంద్ర నిర్వాహకులు, అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న ధాన్యం బస్తాలను లారీల ద్వారా ధాన్యాన్ని ప్రాధాన్యత ఆధారంగా మిల్లులకు త్వరగా తరలించాలన్నారు.
ఆయా కొనుగోలు కేంద్రాల్లో ఈరోజు, రేపు కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
అదనంగా ట్రాక్టర్లతో పాటు లారీలను కూడా వినియోగించి రవాణా వేగం పెంచాలన్నారు.
ప్రతి కేంద్రంలో తగినంత మంది హమాలీలను నియమించి పని వేగవంతం చేయాలన్నారు.
హమాలీలను అవసరాన్ని బట్టి సమర్థవంతంగా వినియోగించాలన్నారు.
ఎటువంటి ఆలస్యం లేకుండా తూకం వేసి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
అకాల వర్షాల కారణంగా ఏమైనా తడిచిన ధాన్యం ఉంటే వెనువెంటనే మిల్లులకు పంపించాలన్నారు. గన్ని సంచులు సరిపడా అందుబాటులో ఉంచాలన్నారు.
ధాన్యం తూకం 41 కేజీలకు వేయాలని, ఎక్కువ, తక్కువకు వేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు అండగా ఉంటామని, వారు కూడా అందుకు అనుగుణంగా సహకరించాలని కోరారు.
అదే విధంగా జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని కోమల్ల టోల్ ప్లాజా వద్ద కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పరిశీలనలో ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్లు రాజేష్, రామానుజాచారి, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.