జూన్ 04
జనగామ
ధాన్యం బస్తాల లోడింగ్ ను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
గురువారం, జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామ పరిధిలో గల పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్రంలో కొనుగోళ్ల నిర్వహణ తీరు, ధాన్యం రవాణా, నమోదు ప్రక్రియలు, కాంటా వివరాలను కలెక్టర్ కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
అలాగే కల్లాల్లో ఇంకా ఎంత ధాన్యం ఉంది? ఎంత ధాన్యం కాంటా చేయాలి? అనే విషయాలను తెలుసుకొని, రిజిస్టర్‌లు, ట్రక్ షీట్లను తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఎన్ని లారీలు కేంద్రానికి చేరుకున్నాయి? ఎన్ని అన్‌లోడింగ్ పూర్తయ్యాయి? ప్రస్తుతం మిల్లులో ఎన్ని లారీలు ఉన్నాయనే? వివరాల గురించి ఆరా తీశారు.
ధాన్యం నిల్వలు ఆలస్యం కాకుండా అత్యంత ప్రాధాన్యతతో అన్‌లోడింగ్, రవాణా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఓపీఎంఎస్ నమోదు ఎన్ని పూర్తయ్యాయో? పర్యవేక్షించి, రైతుల వివరాలు వెంటనే నమోదు చేయాలని తెలిపారు.
అదే విధంగా రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉందని తెలిపారు.