వేములవాడ, జూన్ -03
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పుణ్య క్షేత్ర ఆధ్యాత్మిక శోభ మరింత వెల్లివిరిసేలా గుడి చెరువు బండ్ పార్క్ పై మహాశివుడి విగ్రహం, సప్తమాత్రికల విగ్రహాల ఏర్పాటు పూర్తి అయింది.
వేములవాడ గుడి చెరువు బండ్ పార్కును భక్తి భావం పెంచేలా.. ఆహ్లాదం.. ఆనందాన్ని పంచేలా వీటీఏడీఏ (వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ) ఆధ్వర్యంలో అందంగా తీర్చిదిద్దుతున్నారు.
వేములవాడ దేవస్థానానికి సమీపంలో ఉన్న ఈ బండ్ పార్క్ ను పట్టణ ప్రజలు, ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో పాటు, సుందరీకరణ పనులు చేపడుతున్నారు.
గుడి చెరువు అభివృద్ధి పనులను గత ఆరు నెలల క్రితం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ప్రణాళిక ప్రకారం చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ఆధ్యాత్మికత భావం ఉట్టిపడేలా, భక్తి భావం పెంపొందించేలా మహాశివుడి విగ్రహంతో పాటు, సప్తమాత్రికల విగ్రహాలు, అలాగే గుడి చెరువులో బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆలోచన, ఆదేశాల మేరకు పర్యాటక శాఖ అధికారులు బండ్ పార్క్ లో 40 ఫీట్ల ఎత్తైన మహాశివుడి విగ్రహం, సప్తమాత్రికల విగ్రహాలు ఏర్పాటు చేశారు. గుడి చెరువులో బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టెండర్ దశలో ఉన్నాయి. వేగంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి బోటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బోటింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తే కుటుంబాలతో వచ్చే భక్తులు, పర్యాటకులకు మరింత వినోదాన్ని అందించడంతో పాటు వేములవాడలో పర్యాటక రంగ అభివృద్ధికి కూడా దోహదపడనుంది.
బండ్ పార్క్ లో శివుని విగ్రహం, సప్తమాత్రికల విగ్రహాల ఏర్పాటు, బోటింగ్ సదుపాయం, ఇతర అభివృద్ధి పనులపై పట్టణ ప్రజలు సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నారు.
ప్రారంభానికి సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
తుది దశకు చేరుకున్న బండ్ పార్క్ మిగతా అభివృద్ధి పనులను పూర్తి చేసి, బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చి త్వరగా ప్రారంభానికి సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వేములవాడ పట్టణంలోని గుడి చెరువు బండ్ పార్క్ ను క్షేత్ర స్థాయిలో సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
నేమ్ బోర్డు, టాయిలెట్లు, ఎవెన్యూ ప్లాంటేషన్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభానికి సన్నాహాలు చేయాలని సూచించారు.