రాజన్న సిరిసిల్ల, జూన్ -03
అపరెల్ పార్క్, రైస్ మిల్లులు, గోదాముల్లో ధాన్యం అన్ లోడింగ్ లో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, అపరెల్ పార్క్, రైస్ మిల్లులు, గోదాంలలో అన్ లోడింగ్ వేగవంతం చేయడం, ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసివేశారు.. తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా, తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి ఉన్న బస్తాలను వెంటనే అపరెల్ పార్క్, రైస్ మిల్లులు, గోదాములకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు ఇంకా అవసరమైన గన్ని సంచులు ముందస్తుగా తెప్పించాలని, రైస్ మిల్లుల నుంచి తీసుకోవాలని సూచించారు.
కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి వాహనాలు, హమాలీలను అపరెల్ పార్క్ కు పంపించి, అన్ లోడింగ్ వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని, వాహనాలను ఇతర కేంద్రాలను తరలించాలని సూచించారు.
కొనుగోళ్లు వేగంగా చేపట్టి.. మూడు రోజుల్లో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు సరిపడా వాహనాలు సమకూర్చేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.