జూన్ 02
జనగామ
జూన్ 4, 6, 8, 10 తేదీలలో జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు, వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ, పర్యావరణ వారోత్సవాల నిర్వహణతో పాటుగా గ్రామ సభల నిర్వహణపై మంగళవారం హైదరాబాదు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ సివి ఆనంద్ లు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాల నిర్వహణతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 4, 6, 8, 10వ తేదీలలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి, ప్రజల్లో అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ, ప్రత్యక్ష ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించాలని సూచించారు.
జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
అలాగే రాష్ట్రంలో రైతాంగం స్థిరమైన వ్యవసాయం కోసం పంటల మార్పిడి దిశగా మారాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాలన్నారు. వర్షాకాల సన్నద్ధత, విస్తృత స్థాయి మొక్కల నాటకం, ఘన వ్యర్థాల నిర్వహణతో పరిశుభ్రమైన గ్రామాల నిర్మాణం వంటి అంశాల్లో ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాలు, స్థానిక నాయకుల భాగస్వామ్యంతో ప్రజల్లో చైతన్యం కల్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
అదే విధంగా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి, ప్రజలకు విస్తృత స్థాయిలో చేరువ కావాలని సూచించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల విజయవంతమైన అమలుకు పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. జూన్ 4, 6, 8, 10 తేదీలలో జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా గ్రామ సభలు, వార్డు సభలు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక పర్యావరణ వారోత్సవాలను కొనసాగిస్తూనే గ్రామ, వార్డు సభలను కూడా చేపట్టాలన్నారు.
మండలాల వారీగా ఆ నాలుగు తేదీలలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు జరిగేలా చూడాలని డిపిఓకు ఆదేశించారు. ఈ గ్రామ సభల్లో బాల్య వివాహాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు కల్పించాలన్నారు. వీటితో పాటుగా రైతాంగం పంట మార్పిడి దిశగా అడుగులు వేసేందుకు అవగాహన కల్పించాలని సూచించారు.
వరి పంటకు ఆసక్తి చూపినట్లయితే సన్న రకం వరి పంటను వేసే విధంగా ప్రోత్సహించాలన్నారు.
ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియపై ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
ఘన వ్యర్ధాల నిర్వహణ, ఇంకుడు గుంతల ప్రాధాన్యత, మొక్కల పెంపకంపై చైతన్యం కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకు అధికారులందరూ సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించి, విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ వీడియో సమావేశంలో జెడ్పీ సీఈవో రంగా రావు, డీఏఓ అంబికా సోనీ, డీపీఓ వెంకట్ రెడ్డి, సీపీఓ చినకోట్యా నాయక్, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.