జిల్లాలో కొజూన్ 2
జనగామ
నసాగుతున్న వరి కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయముగా పని చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, రవాణా పరంగా తీసుకుంటున్న చర్యల పురోగతిపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి, కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దాదాపు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు వచ్చిందని, అధికారులు సమన్వయంతో పని చేస్తే జిల్లాలో విజయవంతంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రవాణా పూర్తవుతుందన్నారు.
ఈ సందర్భంగా ప్రతి మిల్లు, కేంద్రం వారీగా కొనుగోలు వివరాలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు, అలాగే మిల్లుల వద్ద ఎంత అన్లోడింగ్ పెండింగ్ ఉంది అని నిశితంగా కలెక్టర్ సమీక్షించారు.
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వేగంగా తరలించి, నిల్వ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
మిల్లర్లతో సమన్వయం పెంచి, సీఎంఆర్ (CMR) బియ్యం అప్పగింతలు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, రవాణా కాంట్రాక్టర్లు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిల మధ్య సమన్వయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని చిల్పూర్, రఘునాథపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, బచ్చన్నపేట, నర్మెట్ట, జఫర్‌గఢ్, లింగాల ఘనపూర్, తదితర మండలాల్లో కొనుగోళ్ల పురోగతి, ధాన్యం తరలింపు, మిల్లింగ్ ప్రక్రియలను నిశితంగా సమీక్షించారు.
పెండింగ్‌లో ఉన్న రైతుల చెల్లింపులను వెంటనే పూర్తి చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యత అని, కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ధాన్యం రవాణా, నిల్వ, అన్లోడింగ్, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎటువంటి జాప్యం లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
డీఎం సీఎస్, డీసీఎస్ఓ, డిప్యూటీ తహసీల్దార్లు సమన్వయంతో లారీల కేటాయింపు చేపట్టి, కొనుగోలు అయిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలన్నారు.
మిల్లులకు ఎక్కువగా తరలించాల్సిన ధాన్యం ఉన్న కేంద్రాలకు అదనంగా లారీలను పంపించాలని జిల్లా రవాణా శాఖ అధికారికి కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో డీఆర్‌డీవో భాస్కర్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్, రవాణా శాఖ అధికారి శిల్ప, జిల్లా మార్కెటింగ్ అధికారి రామకృష్ణ, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, మెప్మా పీడీ , ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.