జూన్ 01
జనగామ రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ప్రతిరోజూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ధాన్యం కొనుగోళ్లు, రవాణా, మిల్లులకు తరలింపు, సమస్యలపై ఆరా తీస్తున్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నారు.
మరోవైపు జిల్లాలోని వివిధ మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శిస్తూ, రైతులతో మాట్లాడుతున్నారు. కాంటా ప్రక్రియ, తేమ శాతం పరీక్షలు, రికార్డుల నిర్వహణ, ధాన్యం నిల్వలు, రవాణా ఏర్పాట్లను పరిశీలిస్తూ, కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ధాన్యం బస్తాలు కేంద్రాల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా వెంటనే మిల్లులకు తరలించాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట అదనపు వాహనాలు, హమాలీలను అందుబాటులో ఉంచి కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు (27879) రైతుల వద్ద నుంచి (173128.670) మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, అందులో ఇప్పటికే (163996.240) మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించడం జరిగిందని, అలాగే (26305) మంది రైతుల ఖాతాల్లోకి రూ. 315 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా (138240.560) మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఓపీఎంఎస్ లో నమోదు చేయడం జరిగిందని, మొత్తం (572) మంది హమాలీలు ఉన్నారన్నారు.
ప్రతి మిల్లు, కేంద్రం వారీగా కొనుగోలు వివరాలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు, అలాగే మిల్లుల వద్ద ఎంత అన్లోడింగ్ పెండింగ్ ఉంది అని క్షుణ్ణంగా సమీక్షించారు.
ధాన్యం రవాణా, నిల్వ, లోడింగ్, అన్లోడింగ్, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎటువంటి ఆలస్యం లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
జిల్లాలో ప్రస్తుతం (234) లారీలు, (66) డీసీఎంలు, (307) ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
గోదాములు, రైస్ మిల్లుల వద్ద నిలిచిపోయిన లారీలను వెంటనే అన్‌లోడ్ చేసి, తిరిగి కొనుగోలు కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
పాలకుర్తి, వెంకిర్యాల, బచ్చన్నపేట, కొడకండ్లలో గల పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ముగింపు దశకు చేరుకున్నందున, రవాణా ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షించి, ధాన్యం తరలింపులో ఎటువంటి అంతరాయం లేకుండా మిల్లులకు, గోదాములకు పంపించాలని సూచించారు.
కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు లక్ష్యాలను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మిల్లులకు వచ్చే ధాన్యాన్ని మరింత మంది హమాలీలను పెట్టుకొని, త్వరగా దిగుమతి అయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.
రవాణా, గోదాముల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కొనుగోలు కేంద్రాల పనితీరు పట్ల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, పర్యవేక్షించాలన్నారు.
ఈ సమావేశంలో డీఆర్‌డీవో భాస్కర్, మార్క్‌ఫెడ్ డీఎం చంద్రశేఖర్, డీఎంఓ రామకృష్ణ, అదనపు డీఆర్‌డీవో నూరుద్దీన్, పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.