రాజన్న సిరిసిల్ల, మే -29 జిల్లాలో జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై జిల్లా ఎస్పీ మహేష్ బి గితే, సంబంధిత అధికారులతో
శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.
వేడుకలకు సంబంధించి జెండా ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల డయాస్, సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
వేడుకల వద్ద వైద్య బృందాలచే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని. వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ అందాలని ఆదేశించారు.
సిరిసిల్ల పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా తయారు చేయాలన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ముఖ్య అతిథి గౌరవ వందనం, ఇతర బందోబస్తు ఏర్పాటు పకడ్బందిగా చేయాలని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, కలెక్టరేట్ ఏఓ రామ్ రెడ్డి, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.