రాజన్న సిరిసిల్ల, మే -30 కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేయడంలో జాప్యం చేయవద్దని, సేకరణ ప్రక్రియ మరింత వేగవంతం చేసి సజావుగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ళు, తూకం వేగవంతం చేసి లోడింగ్ చేయడం, అపరల్ పార్క్, గోదాములు, రైస్ మిల్లుల్లో అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాల శాఖ, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా, తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ శనివారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రోజూ వారీగా కొనుగోళ్ళ శాతం పెరిగేలా సంబంధిత పర్యవేక్షణ చేయాలని, ఈ దిశగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంలో జాప్యం చేయకుండా చూడాలని అన్నారు. సేకరణ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, తుది దశలో ఉన్న కేంద్రాలు త్వరితగతిన పూర్తయ్యేలా చూసి అక్కడి నుండి వాహనాలు, హమాలీలను ఇతర కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనే భరోసా క్షేత్ర స్థాయిలో కల్పించాలని సూచించారు.
మిల్లర్లు వేగవంతంగా అన్ లోడింగ్ చేసుకునేలా పర్యవేక్షణ చేయాలన్నారు. కేటాయించిన లక్ష్యం చేరుకోవడంలో జాప్యం చేస్తున్న మిల్లర్లతో మాట్లాడి వేగం పెంచేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించిన ధాన్యానికి సంబంధించి ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.