రాజన్న సిరిసిల్ల, మే -29 రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల కింద మహిళా స్వయం సహాయక సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కే ఫంక్షన్ హాల్ లో
శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రుణాల పంపిణీ..
337 సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద రూ. 40 కోట్లు, ఎఫ్ పీసీ, ఎఫ్ పీజీ సీఐఎఫ్ కింద 42 సంఘాలకు రూ.1 కోటి ఐదు లక్షలు, శ్రీనిధి రూరల్ కింద 278 సంఘాలకు రూ.7 కోట్ల 13 లక్షలు, బ్యాంక్ లింకేజీ మెప్మా రుణాలు 55 సంఘాలకు రూ.6 కోట్ల 33 లక్షలు, శ్రీ నిధి మెప్మా 61 సంఘాలకు రూ. కోటి 50 లక్షల విలువైన చెక్కులను మహిళా సంఘాల బాధ్యులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు.
అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించే సంఘాలకు రూ.11,36,113 కమిషన్ చెక్కును అందజేశారు. స్టాళ్లు ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..
మార్చి 6 వ తేదీన 99 రోజుల కార్యాచరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలపై వివరించడం.. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం కోసం ప్రభుత్వం ఈ కార్యాచరణ అమలు చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 57 వేల కోట్లు బ్యాంక్ లింకేజ్ రుణాలు మంజూరు చేశామని వెల్లడించారు. రుణాలకు సంబంధించిన వడ్డీని తిరిగి చెల్లించామని తెలిపారు.
ప్రతి మహిళను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రజా ప్రభుత్వం వివిధ పథకాలు, రుణాలను మంజూరు చేస్తుందని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో
60 శాతం మహిళల సంఘాలకే ఇచ్చామని తెలిపారు.
ప్రతి పథకంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్తున్నామని, ప్రజలను, మహిళలను భాగస్వా ములను చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తు న్నామని పేర్కొన్నారు. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామని, సిరిసిల్ల లో 37వేల మందికి ఇస్తున్నామని వెల్లడించారు. రెండో దశలో కోటి చీరలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు.
మహిళా సంఘాలకు మంజూరు చేసిన బస్సులతో ప్రతి నెలా రూ.68 వేల ఆదాయం వస్తుందని వివరించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఉత్తమ పనితీరుతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మహిళా సంఘాలకు ఆద్వర్యంలో ఎరువుల షాపు లు ఇవ్వాలని, మహిళా సంఘాలకు ప్రతి మండలానికి ఒకటి రైస్ మిల్లు ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్ లలో ఉచిత ప్రయాణం పథకం కేరళలో కూడా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. చక్కటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని తెలిపారు.
అన్ని వర్గాల ప్రయోజనమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని వివరించారు. రైతులకు ఒకే సారి రూ. రెండు లక్షల రుణ మాఫీ చేశామని, నూతన రేషన్ కార్డులు మంజూరు చేశామని, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ఊపు అందుకున్నాయని పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణాలకు రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించడం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. వచ్చే నెల జూన్ 2వ తేదీ తరువాత మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. మహిళలు రాజకీయ రంగంలోకి కూడా రావాలని సూచించారు. మన జిల్లా అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపి మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. మార్చి 6 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. 10 థీమ్ లతో 10 శాఖల ఆద్వర్యంలో వివిధ కార్యక్రమాలను విజయ వంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సంక్షేమ వారోత్స వాల్లో భాగంగా బాల్య వివాహాల నిర్మూలన, మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధము పరిష్కారాల చట్టం 2013 వివిధ అంశాలపై అవగాహన కల్పించామని వెల్లడించారు. జిల్లాలోని మహిళా సంఘాలు తీసుకుంటున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలని, స్వయం ఉపాధి వైపు ఉపయోగించాలని పిలుపు నిచ్చారు.
మహిళా స్వయం సహాయక సంఘాల ఎన్ పీఏ తక్కువగా ఉందని తెలిపారు. మన జిల్లా నుంచి ఉత్తమ అవార్డ్ తీసుకున్నామని గుర్తు చేశారు. బ్యాంక్ రుణాలను తినుబండారాలు, కిరాణా షాప్, మగ్గం వర్క్, ఇతర ఉపాధి పొందే వాటి కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంకా ప్రభుత్వ సబ్సిడీ పథకాలు ఉన్నాయని, వాటి వివరాలు సంబంధిత శాఖల వద్ద పొందాలని పిలుపు నిచ్చారు.
జిల్లాలో ఆయా మండలాలకు కేటాయించిన బస్సులతో ప్రతి నెలా ఆదాయం వస్తుందని వివరించారు. సోలార్ ప్లాంట్, పెట్రోల్ బంక్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాల ఆద్వర్యంలో కొనసాగుతున్నాయని, విజయవంతంగా కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు.
వృద్ధ మహిళలు, కిశోర బాలికలకు మహిళా సంఘాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
బ్యాంక్ ల కార్యకలాపాలు, అకౌంట్ తీయడంపై అవగాహన కిశోర బాలికలకు వస్తుందని, వారు సామాజిక అంశాలు, స్వయం సమృద్ధి తదితర అంశాలపై చర్చా చేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం మహిళలే లక్ష్యంగా పథకాలు అమలు చేస్తుందని, స్కూల్ యూనిఫాంలు కుట్టించే బాధ్యత, అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మత్తు పనులు మహిళా సంఘాలతో చేయించామని వివరించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు ఏమైనా స్వయం ఉపాధి ఆలోచనలు, ఇతర సహాయం కోసం అధికార యంత్రాంగం సహకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివరించారు.
కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వీర్నపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు. తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.