మే 29
జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాసురక్షిత మాతృత్వానికి సమయానుకూల సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ వారోత్సవాల కింద ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (బలమైన బాల్యానికి - 1000 మెట్లు) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీడబ్ల్యూఓ బెన్షాలోంతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణ కోసం ముందస్తు నమోదు, క్రమబద్ధమైన ఏఎన్‌సీ (Antenatal Care) పరీక్షలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు ప్రారంభ దశ నుంచే నమోదు ప్రక్రియను ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు.
మొదటి పరీక్ష గర్భధారణ 12 వారాల లోపు, రెండో పరీక్ష 14 నుంచి 26 వారాల మధ్య, మూడో పరీక్ష 28 నుంచి 34 వారాల మధ్య, నాలుగో పరీక్ష 36 వారాల తర్వాత నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు.
గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
తల్లి–శిశు సంరక్షణ కార్డు (Mother and Child Protection Card) ప్రతి గర్భిణీ స్వయంగా పూర్తి వివరాలతో నింపి తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్డు ద్వారా గర్భిణీ ఆరోగ్య వివరాలు, పరీక్షలు, టీకాలు, ప్రసవానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుందని చెప్పారు.
జిల్లాలో సురక్షిత మాతృత్వం, శిశు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి గర్భిణీ మహిళకు సమయానికి వైద్య సేవలు, పోషకాహారం, అవగాహన కార్యక్రమాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల ఆరోగ్యంపై ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, గ్రామస్థాయి నుంచి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణీ స్త్రీల నమోదు ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. ప్రతి గర్భిణీకి మాతా, శిశు సంరక్షణ కార్డు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, అందులో అన్ని ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని సూచించారు.
గర్భిణీ మహిళలు కనీసం నాలుగు సార్లు అయినా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. మొదటి పరీక్ష 12 వారాల లోపు, రెండో పరీక్ష 14 నుండి 26 వారాల మధ్య, మూడో పరీక్ష 28 నుండి 34 వారాల మధ్య, నాలుగో పరీక్ష 36 వారాల తర్వాత నిర్వహించాలని పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు ఎనిమిది సార్లు పరీక్షలు చేయించడం మరింత మంచిదని తెలిపారు.
గర్భిణీలకు పోషకాహారం అత్యంత అవసరమని, పాలు, పెరుగు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, బెల్లం, వేరుశెనగలు వంటి ఐరన్, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం ఇవ్వాలని సూచించారు. ప్రతి గర్భిణీకి ప్రత్యేక డైట్ చార్ట్ తయారు చేసి అందించాలని చెప్పారు. ఐసిడిఎస్ ద్వారా అందించే ఇంటికే రేషన్ వంద శాతం లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
టీ, కాఫీ, పచ్చి బొప్పాయి, మరిగించని పాలు వంటి వాటిని గర్భిణీలు తీసుకోకూడదని, వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. అదే విధంగా ఐరన్, కాల్షియం మాత్రలు, అల్బెండజోల్ వంటి మందులను వైద్యుల సూచన మేరకు తప్పనిసరిగా అందించాలని పేర్కొన్నారు.
ఫిట్స్, తీవ్రమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఉమ్మ నీరు కారడం, అధిక బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే పెద్దాసుపత్రికి తరలించాలని సూచించారు. బీపీ ఎక్కువగా ఉండటం, 45 కిలోల కంటే తక్కువ బరువు, గతంలో గర్భస్రావాలు, గుండె వ్యాధులు, హెచ్ఐవి, డయాబెటిస్ వంటి సమస్యలున్న గర్భిణీలను హై రిస్క్ కేసులుగా గుర్తించి, ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు.
గర్భిణీలకు అవసరమైన హెచ్‌బీ పరీక్షలు, బ్లడ్ గ్రూప్, షుగర్ టెస్ట్, హెచ్ఐవి, హెపటైటిస్-బి స్క్రీనింగ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పనిసరిగా చేయాలని సూచించారు.
గర్భిణీలు తగినంత విశ్రాంతి తీసుకోవడంతో పాటు తేలికపాటి నడక వంటి శారీరక వ్యాయామాలు చేయాలని, భారమైన బరువులు ఎత్తడం, పొగ, పురుగు మందులు, కాలుష్య వాతావరణానికి దూరంగా ఉండాలని చెప్పారు. కుటుంబ సభ్యులు గర్భిణీలకు భావోద్వేగ పరమైన సహకారం అందించాలని, ఇంటి పనుల్లో సహాయం చేయాలని సూచించారు.
ప్రతి గర్భిణీకి అంచనా ప్రసవ తేదీ (EDD) స్పష్టంగా తెలియజేయాలని, ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు.
ప్రసవానంతరం మొదటి పాలు శిశువుకు తప్పనిసరిగా ఇవ్వాలని, ఆరు నెలల వరకు తల్లి పాలే అందించాలని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతి గర్భిణీకి అవగాహన కల్పించి, అర్హులైన వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు విస్తృతంగా సమాచారం చేరవేయాలని సూచించారు.
అనంతరం అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడేందుకు ప్రతి కుటుంబం “6 పోషణ సంరక్షణ స్తంభాలు” తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మొదటి వెయ్యి రోజులు శిశువు ఎదుగుదలకు అత్యంత కీలకమని, ఈ సమయంలో సరైన పోషణ, పరిశుభ్రత, సంరక్షణ ఎంతో అవసరమన్నారు.
ఆరోగ్యకరమైన తల్లి – ఆరోగ్యవంతమైన శిశువు – ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని తెలిపారు.
అంతకుముందు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల పోషణ, సంరక్షణపై గర్భిణీ మహిళలకు, బాలింతలకు వైద్యాధికారి అవగాహన కల్పించారు.
అనంతరం మహిళా సంక్షేమ వారోత్సవాల కింద ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (బలమైన బాల్యానికి - 1000 మెట్లు) పోస్టర్లను వారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓలు మనమ్మ, విజయ చంద్రిక, శోభా రాణి, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది, గర్భిణీ మహిళలు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.