ధాన్యం రవాణాకు మరిన్ని అదనపు వాహనాలను కేటాయించాలి
శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం రవాణాకు అదనంగా ట్రాక్టర్లు, లారీలను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
ధాన్యం రవాణా, కొనుగోళ్ల నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, ప్రతి కేంద్రంలో అవసరమైన వాహనాలు, హమాలీలు అందుబాటులో ఉంచి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు ఆలస్యం కాకుండా, ధాన్యం నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా పర్యవేక్షణ చేయాలన్నారు.
లక్ష్యాల వారీగా నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రవాణా, గోదాముల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొనుగోలు కేంద్రాల పనితీరు పట్ల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ సమావేశంలో డీఆర్‌డీవో భాస్కర్, డీసీఓ కోదండరాములు, డీఎంఓ రామకృష్ణ, పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, డీఏఓ అంబికా సోనీ, రవాణా శాఖ ఏఎంవీఐ మహేష్, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.