పెద్దపల్లి, మే-27 మే 29న ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా బాల సదనం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సుల్తానాబాద్‌లోని బాలసదనం, వృద్ధాశ్రమం, తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మే 29న ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా బాలసదనం ప్రారంభోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
బాలసదనం నిర్వహణ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, చిన్నారులకు సౌకర్యవంతమైన మరియు భద్రమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వృద్ధాశ్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ అక్కడి వసతులు, ఆహారం, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. వృద్ధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
తదుపరి సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, పెండింగ్‌లో ఉన్న భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మీ సేవా ద్వారా వివిధ ధృవపత్రాల కోసం వచ్చే దరఖాస్తులను సకాలంలో స్క్రూటినీ పూర్తి చేసి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు.
తహసీల్దార్ కార్యాలయంలో మధ్యవర్తులకు ఎలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేసిన కలెక్టర్, ప్రజలు తమ సమస్యలను నేరుగా తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు సత్వర సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో బి.డబ్ల్యూ.ఓ. వేణుగోపాల్, సుల్తానాబాద్ తహసీల్దార్ బషీరోద్దీన్, తదితర అధికారులు పాల్గొన్నారు.
--------------------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.