రాజన్న సిరిసిల్ల, మే-27
జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, మిల్లులు, గోదాంలలో అన్ లోడింగ్ వేగవంతం చేసి నిల్వ చేయడం, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ పురోగతి, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా, తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల్లో అన్ లోడింగ్ పై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. మిల్లుల వారీగా లక్ష్యం మేరకు ధాన్యం అన్ లోడింగ్ చేయాలని స్పష్టం చేశారు. కొనుగోళ్ల శాతం పెరిగేలా చూడాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న బస్తాలను వెంటనే మిల్లులు, గోదాములకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గన్నీ బ్యాగులు, కొనుగోలు కేంద్రాల్లో చేస్తున్న ట్యాబ్ ఎంట్రీ, తదితర వివరాలు ఆరా తీశారు.
కొనుగోళ్ళు పూర్తయిన కేంద్రాల నుంచి వాహనాలు, హమాలీలను అపరెల్ పార్క్ కు పంపించి, అన్ లోడింగ్ వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని, వాహనాలను ఇతర కేంద్రాలను తరలించాలని సూచించారు.
సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్ళు సజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు సరిపడా వాహనాలు సమకూర్చేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.