జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
మంగళవారం, జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్)లో ఉన్న (మెప్మా) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ధాన్యం కొనుగోలు కేంద్రం, ఘనపూర్ (స్టేషన్) మండలంలోని నమిలిగొండ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం, అలాగే జఫర్గడ్ మండలంలోని కూనూరు గ్రామంలో గల పీఏసీఎస్ ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మిక తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా మెప్మా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎన్ని టోకెన్లు జారీ చేశారు? ఇప్పటివరకు ఎన్ని లారీలు, ట్రాక్టర్లు ధాన్యం తరలించాయి? ఏ సమయంలో ఏ మిల్లుకు పంపించారు? ట్రక్ షీట్‌లో వివరాలు సక్రమంగా నమోదు చేశారా? అనే అంశాలపై ఆరా తీశారు. అలాగే ఇప్పటివరకు ఎన్ని ఓపీఎంఎస్ ఎంట్రీలు పూర్తి చేశారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టోకెన్ జారీ నుంచి మిల్లులకు తరలింపు వరకు ప్రతి అంశాన్ని పారదర్శకంగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టోకెన్ పొందిన రైతుల సంఖ్య, ప్రతి టోకెన్‌కు అనుగుణంగా ఎన్ని లారీలు, ట్రాక్టర్లు పంపించారో స్పష్టమైన రికార్డులు నిర్వహించాలని సూచించారు.
ప్రతి మిల్లుకు ఏ సమయానికి వాహనాలు బయలుదేరాయో, ఇప్పటివరకు మొత్తం ఎన్ని లారీలు వెళ్లాయో, ట్రక్ షీట్‌లో నమోదు చేసిన వివరాలు సరిపోలేలా చూడాలని తెలిపారు. కేంద్రాల్లో ప్రస్తుతం ఎన్ని కళ్లాల్లో ధాన్యం నిల్వలో ఉందో, ఎన్ని వాహనాల ఎంట్రీలు నమోదయ్యాయో కూడా నిరంతరం నవీకరణ చేయాలని ఆదేశించారు.
ధాన్యం తేమ (Moisture) శాతాన్ని టోకెన్ వారీగా నమోదు చేసి, నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
అలాగే ఐకేపీ నమిలిగొండ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి, కేంద్రంలో ట్రక్కులు ఎప్పుడెప్పుడు బయలుదేరాయో, ఇప్పటివరకు ఎన్ని వాహనాలు వెళ్లాయో, ట్రక్ షీట్‌లో నమోదైన వివరాలను పరిశీలించారు.
ధాన్యం నిల్వలు, గన్ని సంచుల లభ్యత, కాంటా పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న ధాన్యం బస్తాల వివరాలు, రిజిస్టర్ నిర్వహణ, తదితర అంశాలపై ఆరా తీశారు. కేంద్రంలో ప్రస్తుతం ఎంత మంది హమాలీలు పనిచేస్తున్నారో తెలుసుకుని అవసరమైతే అదనపు హమాలీలను ఏర్పాటు చేసి వెంటనే లోడింగ్, అన్లోడింగ్ పనులు చేపట్టాలని సూచించారు.
అలాగే ధాన్యం రవాణా ఆలస్యం కాకుండా ట్రక్కులు, డీసీఎంల ద్వారా వేగంగా తరలించాలని, లక్ష్యంగా నిర్ణయించిన రవాణా ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర నిర్వాహకులకు సూచించారు.
అదే విధంగా ధాన్యంలో తేమ (Moisture) శాతం, టోకెన్ వారీగా ధాన్యం కొనుగోలు పరిస్థితి, కాంటా నిర్వహణ, ఓపీఎంఎస్ నమోదు, గన్ని సంచుల లభ్యత, రిజిస్టర్ నిర్వహణ, తదితర అంశాలను పరిశీలించారు.
కాంటా వద్ద 41 కిలోల ప్రకారం తూకం వేయాలని సూచించారు.
ధాన్యం నిల్వ కాకుండా కేంద్రాల నిర్వహణ సమర్థంగా ఉండాలని సూచించారు.
పీఏసీఎస్ కూనూరు కేంద్రంలో డీసీఎంల ద్వారా ధాన్యం తరలింపు పరిస్థితిని పరిశీలించారు.
ఈ క్రమంలో రెండు లారీలను తక్షణమే ఈ కేంద్రానికి పంపించాలని ఆర్టీఓకు సూచించారు.
ఈ నేపథ్యంలో రైతులతో మాట్లాడిన కలెక్టర్, తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కొనుగోలు కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతమైన చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.