మే 25
జనగామ జిల్లా ఈ నెల 28న బక్రీద్ పండుగ సందర్భంగా (స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్, సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టు అనిమల్స్) నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి జంతుబలులు జరగకుండా ఉండేందుకు డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పశుసంవర్ధక శాఖ అధికారులు, హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలపై సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ - 48 ప్రకారం పశుజాతుల రక్షణ, వాటిని అభివృద్ధి చేయుట, జంతువుల వధించుట నిషేధమని అన్నారు. ఈ ఆర్టికల్ ప్రకారంగా ఆవులు, దూడలు, పాలిచ్చే పశువులు, పనిచేసే పశువులను వధించడం నిషేధమని పేర్కొన్నారు.
గోమాతను పరిరక్షించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
పోలీస్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని, చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలన్నారు.
పండుగను పురస్కరించుకొని మాంసపు విక్రయాల వద్ద మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య మెరుగుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను విజయవంతంగా నిర్వహించుకునేలా ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు.
ఈద్గా ప్రాంగణాల్లో తాగునీరు, వైద్య సదుపాయాలు, ఫైర్ ఇంజన్‌లు, పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ శాఖ ద్వారా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పండుగ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పంచాయతీ శాఖ ద్వారా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలని, ఎండల తీవ్రత దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.
వ్యర్థాలను కాలువల్లో వేయకుండా పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
విద్యుత్ శాఖ అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు.
అదే విధంగా గోశాలల స్థాపనకు కృషి చేయాలని హిందూ మత పెద్దలను కోరారు.
అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. జిల్లాలో బక్రీద్ పండుగను ప్రశాంతంగా, సోదరభావంతో నిర్వహించుకోవాలని తెలిపారు.
జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం మూడు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అక్రమ రవాణాపై నిఘా మరింత కట్టుదిట్టం చేశామని చెప్పారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ కర్టెన్లు ఏర్పాటు చేయడం, వ్యర్థాలను ఒకేచోట ప్రత్యేక బాక్సుల్లో వేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
పండుగ సమయంలో పరస్పర సహకారం, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
అంతకుముందు హిందూ, ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ.. సమాజానికి మంచి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న కలెక్టర్ కు అన్ని వర్గాలు సహకరించాలని, పరిపాలనకు నిదర్శనంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహరిస్తున్నారని హిందూ, ముస్లిం మత పెద్దలు కొనియాడారు.
జనగామకు ప్రత్యేక స్థానం ఉందని, హిందూ, ముస్లింలు రక్త సంబంధీకుల్లా సామరస్యంగా కలిసి జీవిస్తున్నాయని తెలిపారు.
ఈ సమావేశంలో డివిహెచ్ఓ మురళీధర్ రావు, ఇతర సంబంధిత అధికారులు, హిందూ, ముస్లిం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.