రాజన్న సిరిసిల్ల, మే -23రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మొక్కలు నాటే
లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో వివిధ శాఖల ఆద్వర్యంలో మొక్కలు నాటే లక్ష్యంపై జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, పలు శాఖలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టబోయే పర్యావరణ వారం గురించి అడిగి తెలుసుకున్నారు.
జూన్ 1వ తేదీ నుంచి ప్లాంటేషన్ చేయడానికి సిద్ధంగా ఉండాలని, స్థలాల గుర్తింపు చేసి ఉంచాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని, మియావాకి ప్లాంటేషన్ పై దృష్టి సారించాలని ఆదేశించారు. స్థలాల గుర్తించి.. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు
జిల్లాలోని వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు పక్కా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. గతంలో నాటిన మొక్కలు ఎండిపోయిన, పెరగకపోయిన వాటి స్థానంలో ఇప్పుడు వన మహోత్సవంలో భాగంగా నాటాలని పిలుపు నిచ్చారు.
వన మహోత్సవంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన మొక్కల లక్ష్యాలు ఇలా ఉన్నాయి. గ్రామీణ అభివృద్ధి శాఖకు 5,70,000, సిరిసిల్ల మున్సిపాలిటీకి 1,00,000, అటవీ శాఖకు 75,000, వేములవాడ మున్సిపాలిటీకి 50,000, వ్యవసాయ శాఖకు 25,000, ఎక్సైజ్ శాఖకు 20,000
ఉద్యానవన, నీటి పారుదల శాఖ 15,000 వేల చొప్పున, విద్యా శాఖ కు 10,000, పోలీస్ శాఖ, ఆర్ అండ్ బీ శాఖకు 4,000 చొప్పున, వైద్య ఆరోగ్య శాఖకు 2,000, పరిశ్రమల శాఖకు 1,000, మైనింగ్ శాఖకు 200.. మొత్తం 8,91,200 గా లక్ష్యాన్ని నిర్ణయించామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు.
కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ నరసింహాచారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీఈవో జగన్ మోహన్ రెడ్డి, డీపీఓ షర్ఫుద్దీన్, డీఏఓ అఫ్జల్ బేగం, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ రజిత, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.