రాజన్న సిరిసిల్ల, మే -19నైపుణ్యాభివృద్ధితో ఎన్నో అవకాశాలు వస్తాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాల సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జయ జయహే తెలంగాణ పాటను వినిపించారు.
ఈ సందర్భంగా వివిధ శిక్షణ సంస్థలు ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఆర్ సేటీ, జీఎంఆర్, ఐడీటీఆర్, టాస్క్, ఇతర సంస్థల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి.. ఏ ఏ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు? అర్హత ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
దేశ, రాష్ట్ర అభివృద్ధిలో నేటి యువత, విద్యార్థులు చాలా కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటీవల విద్యా శాఖ వారోత్సవాల కింద సమ్మర్ క్యాంపులు నిర్వహించామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఎన్నో అంశాల్లో ప్రతిభ చూపారని గుర్తు చేశారు. విద్యతోపాటు ఆటలు ఆడాలని, దీంతో శారీరక, మానసిక సమతుల్యత ఉంటుందని, క్రమ శిక్షణ అలవడుతుందని వివరించారు. ఉన్నత చదువుతోపాటు టెక్నికల్ స్కిల్స్, సాప్ట్ స్కిల్స్ నేర్చుకోవాలని సూచించారు. ఇప్పటి పరిశ్రమలకు ఎలాంటి స్కిల్స్ అవసరమో తెలుసుకొని ఆ దిశలో ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు.
ఐటీఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ఆర్ సేటీ, జీఎంఆర్, ఐడీటీఆర్, టాస్క్ తదితర సంస్థల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ కోర్సులను సద్విని యోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. పూర్తి వివరాలకు ఆయా సంస్థల్లో సంప్రదించాలని సూచించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లో శిక్షణ పొందిన వారికి పలు సంస్థలు ఉపాధి కల్పిస్తాయని తెలిపారు.
పరిశ్రమల శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల ఆద్వర్యంలో అందిస్తున్న స్వయం ఉపాధి స్కీములు, సబ్సిడీ సద్వినియోగం చేసుకొని.. స్వయం యువత ఉపాధి పొందాలని ఆకాంక్షించారు.
జిల్లాలోని వివిధ శిక్షణ సంస్థలు ఏడాది అంతా యువతకు శిక్షణ అందించేలా ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్లాలని సూచించారు.
నర్సింగ్ పూర్తి చేసి.. విదేశాల భాష, నైపుణ్యాల్లో పట్టు ఉన్న వారికి టామ్ కామ్ ఆద్వర్యంలో వివిధ దేశాల్లో ఉపాధి కల్పన అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. జిల్లా నుంచి ఇప్పటిదాకా
45 మందికి విదేశాల్లో కొలువులు వచ్చాయని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. యువత ఉపాధిని పొంది తమ తల్లితండ్రుల సంరక్షణ బాధ్యతను చూసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సీపీఓ శ్రీనివాసాచారి, జీఎం ఇండస్ట్రీస్ హనుమంతు, డీవైఎస్ఓ రాందాస్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఎల్డీఎం మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.