పెద్దపల్లి, మే -15:ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఎడ్యుకేషన్ వీక్ కార్యక్రమాలలో 5వ రోజు “గ్రంథాలయాలు – జ్ఞానానికి పునాది, పఠన సంస్కృతికి మార్గదర్శి” అనే అంశంపై జిల్లావ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తెలిపారు.
శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, జిల్లా విద్యాశాఖాధికారి జి. శారదతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శనలు, పుస్తక సమీక్షలు, పఠన చర్చా వేదికలు, గ్రంథాలయాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ, గ్రంథాలయాలు జ్ఞానానికి పునాది, పఠన సంస్కృతికి మార్గదర్శిగా నిలుస్తాయని తెలిపారు. జిల్లాలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం సుమారు రూ.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆధునిక గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
గ్రంథాలయాలు పుస్తక పఠనానికి ప్రశాంతమైన కేంద్రాలని, రీడర్స్‌తో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని,
జిల్లాలోని వివిధ మండలాల్లో మొత్తం 253 పుస్తక ప్రదర్శనలు, 224 పఠన, పుస్తక సమీక్షా సమావేశాలు, 171 అంశాధారిత చర్చలు, 143 గ్రంథాలయ, డిజిటల్ లైబ్రరీ అవగాహన కార్యక్రమాలు, 27 పుస్తక దాన కార్యక్రమాలు నిర్వహించగా, మొత్తం 1,969 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి జి. శారద మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు ఉపయోగపడే ప్రాథమిక స్థాయి, హైస్కూల్ స్థాయి పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె తన విద్యార్థి దశను స్మరించుకుంటూ, “ఈ గ్రంథాలయమే నన్ను, నా కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకువచ్చింది” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
ప్రతి పాఠశాలలో పఠన సంస్కృతిని అభివృద్ధి చేయడం ద్వారా విద్యార్థుల్లో జ్ఞానార్జనతో పాటు విలువలు, సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యాలు పెరుగుతాయని, కార్యక్రమాలను విజయవంతం చేసిన మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రంథపాఠకులను,విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి సి.హెచ్. మల్లేష్ ,అకాడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్. పి.ఎం. షేక్, జి. కవిత, స్థానిక కౌన్సిలర్ కమల్, గ్రంథపాఠకులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.