ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా (190) అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్ లో లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి
పెద్దమడ్డూర్ గ్రామం, దేవరుప్పుల మండలానికి చెందిన మామిల్ల వినయ్, తాను (బిసీబి) గౌడ్ కులానికి చెందిన వాడని, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇసుక కొరకు మనవి చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు.
మాణిక్యాపురం గ్రామం, లింగాల ఘనపురం మండలానికి చెందిన సర్పంచ్ విజయ భాస్కర్, ఉప సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు రాకపోవడం వల్ల కాంటాలు సరిగా జరగడం లేదని, వెళ్లిన లారీలు వెంటనే దిగుమతి కాకపోవడం వల్ల లారీలు పంపడం లేదని, కావున రోజుకు రెండు లేదా మూడు లారీలు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని దరఖాస్తు చేసియున్నారు.
జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ కు చెందిన వీరస్వామి, తనకు 65 సంవత్సరాలు అని, కూలి పని చేస్తుంటారని, నిరుపేద కుటుంబానికి చెందినవాడని, తన కుడి కన్ను కనపడదని, తన సదరం సర్టిఫికెట్ లో 40 శాతం వికలాంగుడని వచ్చిందని, తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, ఈ మేరకు వికలాంగుల పింఛను ఇప్పించగలరని ప్రార్థిస్తూ ఆర్జీ ద్వారా కోరారు.
జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్, 13వ వార్డుకు చెందిన చెరుకు శ్రీనివాస్, తాను వికలాంగుడని, 9 నెలల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, తన ఇంటి వాల్యుయేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తును సమర్పించినారు.
తొర్రూరు గ్రామం, పాలకుర్తి మండలానికి చెందిన జి. నాగరాజు, తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, ప్రభుత్వ పథకాల ద్వారా లభించే స్వయం ఉపాధి కోసం ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని మంజూరు చేయవలసిందిగా కోరుతూ దరఖాస్తు అందించనైనది.
ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, జెడ్పీ సీఈవో రంగా రావు, జనగామ మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, సీపీఓ చిన కోట్యా నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.