సిరిసిల్ల, మే -09 సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
శనివారం ఉదయం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మొదటి దశ జనగణనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జనగణనపై క్షేత్ర స్థాయి ప్రచారం, అవగాహన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కూడలి నుండి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన 2కె వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత భారతదేశంలో జనగణన చేయడం జరుగుతుందని, మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇది మొదటి జనగణన అని, మొదటి సారి డిజిటల్ విధానంలో ఈ జనగణన నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
స్వీయగణన అనే విధానం తొలిసారి ప్రవేశపెట్టి జనగణన ప్రక్రియలో నూతన అధ్యాయానికి నాంది పలకడం జరిగిందని పేర్కొన్నారు. మీ కుటుంబ వివరాలను స్వయంగా మీరే నమోదు చేసుకునే చేసుకునే అవకాశం స్వీయ గణన ద్వారా కల్పించారని, ఇందులో 34 ప్రశ్నలు ఉన్నాయని, కేవలం ఐదు నిమిషాల్లో స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. స్వీయ గణన కోసం https://se.census.gov.in సైట్ లో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు.
స్వీయగణన చేయడానికి రేపే (ఆదివారం) తుది గడువు అని, స్వీయ గణనలో పాల్గొని వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
సోమవారం నుండి జనగణన ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించడం జరుగుతుందని అన్నారు. అనుభవజ్ఞులైన సిబ్బందిని జనగణన సూపర్ వైజర్లు, ఎన్యూమరేటర్లుగా నియమించి వారికి అవసరమైన శిక్షణ అందించడం జరిగిందని వెల్లడించారు. వారికి ప్రత్యేక ఐడీ కార్డులు కూడా జారీ చేశామని, ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించాలని కోరారు.
జనగణన పేరుతో ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగే అవకాశం ఉంటుందని, అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. జనగణనలో పాల్గొనే సిబ్బందికి జారీ చేసిన గుర్తింపు కార్డుల మీద క్యూ ఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేస్తే అధికారిక వెబ్ సైట్ లో పొంది ఉంచిన వారి పూర్తి వివరాలు వస్తాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
జనగణన ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, జనగణనలో భాగస్వామ్యులు అయ్యే బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉంటుందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసా చారి, మున్సిపల్ కమీషనర్ ఖదీర్ పాషా, జిల్లా అధికారులు అఫ్జల్ బేగం, సౌజన్య, లక్ష్మీరాజం, స్వప్న, తహసీల్దార్ జయంత్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, ఎస్ ఓ సంపత్, జనగణన సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.