పెద్దపల్లి, మే 05:ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ పనులు వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
మంగళవారం ఎలిగేడు మండలంలోని నర్సాపూర్ ఐకేపీ , మంథనిలోని గంగపురి ఐకెపి కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు. ఈ పరిశీలనలో భాగంగా కేంద్రానికి వచ్చిన పంట పరిమాణం, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, తేమ ఉన్న పంటను వెంటనే కొనుగోలు చేసి మిల్లర్లకు త్వరితగతిన తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో అవసరమైన తార్పాలిన్‌లు సిద్ధంగా ఉంచాలని, గన్నీ బ్యాగుల సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
వేడిగాలుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్రంలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో లోడింగ్, అన్‌లోడింగ్ పనులు వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రవాణా వాహనాలు, హమాలీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ యాకన్న, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఏ డి ఏ అంజని, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.