ఎలగందుల(కొత్తపల్లి): కరీంనగర్
తేది: 07.02.2026
చట్టాల పట్ల అవగాహన లేని కారణంగా చాలా మంది నేరాల బాట పడుతున్నారని, విద్యార్థి దశ నుంచే న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే సురక్షిత సమాజం ఏర్పాటవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పిలుపునిచ్చారు. కొత్తపల్లి మండలం ఎలగందుల గ్రామంలోని తెలంగాణా మోడల్ స్కూల్‌లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆదేశాలతో 'న్యాయ విజ్ఞాన సదస్సు' ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడుకుంటూనే, పౌర బాధ్యతలను నెరవేర్చాలని వారు సూచించారు. న్యాయం కేవలం ధనవంతులకే కాదని పేదలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందిస్తుందని వివరించారు. సదస్సులో పాల్గొన్న ప్యానల్ న్యాయవాదులు పలు అంశాలపై ప్రసంగించారు. మత్తు పదార్థాల సేవనం ఒక సామాజిక రుగ్మత అని న్యాయవాదులు పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల వల్ల విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సరదా కోసం మొదలయ్యే అలవాటు, చివరకు నేరాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఎన్.డి.పి.ఎస్ చట్టంలోని సెక్షన్ల గురించి వివరిస్తూ, మత్తు పదార్థాల రవాణా చేసినా లేదా వినియోగించినా బెయిల్ రావడం కష్టమని, కఠిన కారాగార శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. విద్యార్థులు అటువంటి అలవాట్లకు దూరంగా ఉంటూ, తమ స్నేహితులను కూడా చైతన్యపరచాలని కోరారు. ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఆన్‌లైన్ నేరాలు పెరిగిపోతున్నాయని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరగాళ్లు రకరకాల ఆశలు చూపి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని, ఓటిపి (OTP)లు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. సోషల్ మీడియాలో అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా విద్యార్థినులు వ్యక్తిగత ఫోటోలను ఇంటర్నెట్‌లో పెట్టేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఒకరిని కించపరుస్తూ పోస్ట్‌లు పెట్టినా, అసభ్యకర సందేశాలు పంపినా ఐటి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సైబర్ వేధింపులకు గురైతే తక్షణమే '1930' నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ర్యాంకుల కోసం, మార్కుల కోసం తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని, ఇది వారి ఎదుగుదలకు ఆటంకమని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. మానసిక ఒత్తిడిని జయించడానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని వివరించారు. వైఫల్యం ఎదురైనప్పుడు పిరికిపంద చర్యలకు పాల్పడకుండా, సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని హితవు పలికారు. ప్రణాళికాబద్ధమైన చదువు, క్రీడలు, మరియు పెద్దల సలహాలు తీసుకుంటే ఒత్తిడిని అధిగమించి అద్భుతమైన విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్న విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి, ఏ. కిరణ్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్, కొడిమ్యాల శ్రీనివాస్, ప్యానెల్ న్యాయవాదులు కీర్తి శ్రీధర్, బొజ్జ శ్రీలక్ష్మి, అశ్విని, యస్. ప్రవీణ్ కుమార్, ఏ. వెంకటేష్, కే. ఆనంద్ భాస్కర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సు తమకు ఎంతో జ్ఞానాన్ని అందించిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానంతరం అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు.
End
TELANGANA RAJANNA SIRCILLA
చట్టాలపై అవగాహనతోనే సురక్షిత సమాజం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం