*ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదు : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*పెద్దపల్లిలోని 33వ వార్డు,19వ వార్డు లో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్*
*మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలి*
--------------------------
పెద్దపల్లి, జూలై 10:
-------------‐------------
పెద్దపల్లి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు నమోదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అధికారులను ఆదేశించారు.
శుక్రవారం పెద్దపల్లి పట్టణంలోని పెద్ద మసీదు సమీపంలోని 33వ వార్డు భారత్ నగర్, 19వ వార్డు బండారికంట లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించే ఈ ప్రక్రియలో అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి ఫారాలను సేకరించేటప్పుడు ఎటువంటి తప్పులు దొర్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఓటరు నమోదు ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సందేహాలను నివృత్తి చేసేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మున్సిపల్ సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే, గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ సమైక్య సంఘాల సభ్యుల సహకారంతో ఎన్యూమరేషన్ ఫారాలను ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా పర్యవేక్షించాలని సూచించారు.
ఈ తనిఖీలో ఆర్.డి.ఓ. గంగయ్య,మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్,ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.