వేములవాడ, ఏప్రిల్ -02
----------------------------------------
ప్రజా ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా గురువారం గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించగా, వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామం గ్రామ సభ, వేములవాడ పట్టణంలోని 25 వార్డులో వార్డు సభ లు నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ కింద పలు యంత్రాలను ప్రారంభించారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. చెక్కపల్లి గ్రామం, వేములవాడ పట్టణంలోని 25 వార్డులో ఆరు గ్యారంటీల అమలు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న వారి వివరాలు చదివి వినిపించారు.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు రుణ మాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 లకే గ్యాస్ సిలిండర్లు, ఇతర ప్రభుత్వ పథకాలతో లబ్దిపొందుతున్న వారు తమకు జరుగుతున్న మేలు వివరించారు. వివిధ పథకాల ద్వారా ఆదా అవుతున్న డబ్బులను తమ పిల్లల ఉన్నత చదువులకు, పొదుపు వైపు మళ్ళిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలుపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ పథకాలు అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతఙ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు అండగా ఉన్నారని తెలిపారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా నిలిచిందని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కోటి 15 లక్షల మంది రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు త్వరలో 5 లక్షల జీవిత బీమా కల్పించనున్నామని పేర్కొన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డు ఇస్తున్నామని వివరించారు. రూ.14, 600 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు సన్నం బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇటీవల సన్న బియ్యం పంపిణీ చేసి సంవత్సరం అయిన సందర్భంగా అసెంబ్లీ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నం బియ్యంతో భోజనం చేశారని గుర్తు చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రకియ అని ప్రకటించారు. ఎప్పుడు దరఖాస్తు చేసుకున్న నూతన రేషన్ కార్డు, కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదు.. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. చెక్కపల్లి-వట్టేముల రోడ్డు నిర్మాణానికి అదనంగా నిధులు మంజూరు చేసి పనులు త్వరలోనే ప్రారంభం చేస్తామని వెల్లడించారు. రూ. 6 కోట్లతో భీమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేశామని వివరించారు. వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. వేములవాడ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తెచ్చి వేగంగా విస్తరిస్తున్న పట్టణానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని విప్ తెలిపారు. రాజన్న ఆలయం నుంచి తిప్పాపూర్ బస్సు స్టాండ్ బరకు రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. కోరుట్ల బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని గుర్తు చేసారు. మహాలక్ష్మి కింద ఆర్టీసీ బస్సులో నిన్నటి వరకు మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేసి రూ. 10 వేల కోట్లు ఆదా చేశారని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయడంలో ప్రథమ స్థానంలో ఉన్నాం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జిల్లాలో 1303 ఇండ్లు పూర్తి చేసి రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని, జూన్ 12 వ తేదీ వరకు 10 శాఖల ఆద్వర్యంలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే సర్పంచులు, మున్సిపల్ చైర్మెన్లు, వార్డ్ సభ్యులకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో అవగాహన కల్పించామని తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలు చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నామని వెల్లడించారు.
రైతు రుణమాఫీ కింద 46,492 మంది రైతులకు రూ. 37౦ కోట్లు చేసిందని వెల్లడించారు. నూతన రేషన్ కార్డులు 21,829 మంజూరు చేశామని తెలిపారు. 1,03,537 కుటుంబాలకు ఇప్పటిదాకా రూ. 500 లకే.... 1,76,947 సిలిండర్లు పంపిణీ చేసామని
గృహజ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్న రకం వరికి బోనస్, చేయూత పెన్షన్లు, కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిందని తెలిపారు.
రాష్ట్రంలో త్వరలో అల్పాహార పథకం, ఇందిరమ్మ కుటుంబ జీవితం బీమా పథకం, మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ వరకు విస్తరణ , ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు అందజేయనున్నదని వివరించారు. జిల్లాలోని పలు రెసిడెన్షియల్ విద్యాలయాలకు ఇటీవల గీజర్లు అందించామని, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయలకు, తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టళ్లకు 20 ఫ్రీజర్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. దీంతో విద్యార్థులకు స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లు, పాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని వివరించారు. అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలకు తాను, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు, మండల అధికారులు తనిఖీ చేస్తున్నారని, విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత, ఆవరణ పరిశీలిస్తున్నారని తెలిపారు.
ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం
వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో వంగ హారిక ఇందిరమ్మ ఇల్లు పూర్తి కాగా, గృహ ప్రవేశ వేడుకకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారుకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ రాధాభాయ్, డీఎస్పీ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, జిల్లా పంచాయతి అధికారి షర్ఫుద్దీన్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, చెక్కపెల్లి సర్పంచ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.