పెద్దపల్లి, ఏప్రిల్ 01:
------------------------------
జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 15 లోపు హెచ్.ఎల్.బీ బ్లాక్ నిర్దారణ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం జనగణన 2027 పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ తో కలిసి నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జనగణన 2027 రెండు దశలలో జరుగుతుందని, ప్రస్తుత సంవత్సరం హౌజ్ లిస్టింగ్ కార్యక్రమం మే 10 నుంచి ప్రారంభం అవుతుందని, ప్రతి ఇంటికి సంబంధించి 35 ప్రశ్నల వివరాలు నెల రోజుల వ్యవధిలో సేకరించాలని కలెక్టర్ తెలిపారు.
ఫిబ్రవరి 2027 లో హౌస్ లిస్టింగ్ ప్రకారం జనాభా వివరాల సేకరణ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి 300 ఇండ్లు/800 జనాభా ఒక బ్లాక్ గా (హెచ్.ఎల్.బీ) నిర్దేశించి జనాభా లెక్కల చేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఫీల్డ్ సర్వే సమయంలో మనం వేసుకునే అంచనా కంటే ఎక్కువ ఇండ్లు ఉండే అవకాశం ఉన్నందున 15 శాతం అధికంగా ఎన్యుమరేటర్లు నియామకం చేపట్టాలని అన్నారు.
పట్టణ ప్రాంతాలలో హెచ్.ఎల్.బీ లు మరింత పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డుల వారీగా ఏర్పాటు చేయనున్న హెచ్.ఎల్.బీ. పేపర్ మీద రిపోర్ట్ సిద్దం చేసుకొని ఆన్ లైన్ నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి హెచ్.ఎల్.బీ పరిధిలో ఉన్న ఇండ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, ఆట స్థలాలు, ఆసుపత్రులు ఏం ఉన్నాయో సరిగ్గా ప్లాన్ సిద్ధం చేసుకోవాలని అన్నారు.
హెచ్.ఎల్.బీ ప్రక్రియ ఎంత పకడ్బందీగా చేసుకోగలిగితే రాబోయే 1.5 సంవత్సరాల కాలం పాటు జనాభా లెక్కల కార్యక్రమం అంత ప్రశాంతంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. హెచ్.ఎల్.బీ విభజన రాబోయే 10 రోజులలో తహసిల్దారులు స్థానిక పంచాయతీ కార్యదర్శి మున్సిపల్ కమిషనర్లు సహకారంతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
200 నుంచి 300 ఇండ్లు ఉన్న చిన్న చిన్న గ్రామ పంచాయతీలు, వార్డుల హెచ్.ఎల్.బీ ఆన్ లైన్ ఎంట్రీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఏప్రిల్ 15 లోపు తుది హెచ్.ఎల్.బీ నిర్దారణ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెచ్.ఎల్.బీ ఆన్ లైన్ ఎంట్రీ సమయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
జనగణన 2027 కార్యక్రమం చాలా ముఖ్యమైన అంశమని, దీనిని ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. హౌస్ లిస్టింగ్ నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా 1400 ఎన్యుమరేటర్లు అవసరం ఉంటుందని అంచనా వేశామని, ప్రతి గ్రామం మున్సిపాలిటీ పరిధిలో ఎంతమంది ఎన్యుమరేటర్ అవసరం ఉన్నారో వివరాలు అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్డిఓ లు
బి. గంగయ్య, సురేష్ , ఎంపీడీవోలు, తహసిల్దారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది