ఆగస్టు 14
జనగామజిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివిధ శాఖల జిల్లా అధికారులతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ అధికారులు ముందుగానే పరిశీలించి, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఏ శాఖకు కేటాయించిన పనుల్లోనూ నిర్లక్ష్యం లేకుండా పరస్పర సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనం, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, విద్యార్థులు, అతిథులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య అతిథి సందేశం, జాతీయ గీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
జాతీయ జెండా ఆవిష్కరణకు సంబంధించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వేదికపై ఆసీనులయ్యే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఇతర ఆహ్వానితుల విషయంలో ప్రభుత్వ ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రముఖులను ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించడంతో పాటు, వారికి కేటాయించిన స్థానాలు, వాహనాల పార్కింగ్, తదితర ఏర్పాట్లను ముందుగానే ఖరారు చేయాలని సూచించారు.
విద్యార్థులను వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని, NCC, NSS, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, దేశభక్తి నేపథ్య కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ప్రగతి, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ప్రతిబింబించే విధంగా ముఖ్య అతిథి సందేశం, జిల్లా అభివృద్ధి వివరాలతో కూడిన పుస్తకాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వేడుకల నిర్వహణకు సంబంధించి వేదిక అలంకరణ, పుష్పగుచ్ఛాలు, వేదిక నిర్మాణం, టెంట్, కుర్చీలు, సౌండ్ సిస్టం, మైకులు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యవసర వైద్య, ఇతర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టాలని సూచించారు. వేడుకల ప్రాంగణంలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వేడుకలకు వచ్చే అతిథులు, ప్రముఖులు, ప్రజలు తమ వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా అవసరమైన మార్గదర్శకాలు, బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణను పూర్తిస్థాయిలో డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి, చివరి నిమిషంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా శాఖల వారీగా బాధ్యతలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో జనగామ ఆర్డీఓ గోపీరాం, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.