రాజన్న సిరిసిల్ల, ఆగస్టు -11 జిల్లాలో ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ మహేష్ బి గితె తో కలిసి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, తప్పనిసరిగా హాజరయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు, వేదిక, గ్రౌండ్ తదితర ఏర్పాట్లను పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా
వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలు, జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అవగాహన కలిగే విధంగా స్టాళ్లలో ప్రదర్శించాలని సూచించారు.
దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథి ప్రసంగం కోసం జిల్లాలోని వివిధ శాఖలు చేపట్టిన ముఖ్యమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంక్షిప్త నివేదికలను జిల్లా పౌర సంబంధాల అధికారికి అందజేయాలని ఆదేశించారు.
జిల్లాకు చెందిన ప్రముఖులు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులు వేడుకలకు హాజరయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి ప్రభుత్వ శాఖ తమ కార్యాలయాల్లో కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించడంతో పాటు జిల్లా స్థాయి వేడుకలకు అధికారులు, సిబ్బంది హాజరయ్యేలా చూడాలని తెలిపారు. వేడుకల సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, విద్యార్థులకు అవసరమైన మేర తాగునీటి వసతి ఏర్పాట్లు కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్ఓ జయశ్రీ, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.