ఆగస్టు 07
జనగామ :వ్యవసాయంతో పాటు పౌల్ట్రీ, ఉద్యానవనం, పశుసంవర్ధక వంటి అనుబంధ రంగాలను సమన్వయం చేసుకుంటూ సమీకృత వ్యవసాయ విధానం (ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్) చేపడితే రైతులకు ఏడాది పొడవునా ఆదాయం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
శుక్రవారం, జిల్లాలోని పాలకుర్తి మండలం, గూడూరు గ్రామంలో రైతు సంపత్ నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పంటలు, పౌల్ట్రీ యూనిట్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా జొన్న, పత్తి, బెండ సాగు వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. సుమారు ఒకటిన్నర ఎకరాల్లో జొన్న, బెండ పంటలు సాగు చేస్తున్నట్లు రైతు వివరించారు.
అలాగే ప్రస్తుతం ఎన్ని కోళ్లు ఉన్నాయని రైతును అడుగగా, రైతు సంపత్ సుమారు 6,000 కోళ్లు ఉన్నాయని కలెక్టర్ కు తెలిపారు. కోడి మార్కెట్ ధర, కిలో చికెన్ ధర, కోళ్లకు అందిస్తున్న దాణా, తాగునీటి నిర్వహణ, ఒక్క బ్యాచ్ పెంపకానికి పట్టే కాల వ్యవధి వంటి అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు.
రైతు స్పందిస్తూ.. కోళ్ల పెంపకంలో ఒక బ్యాచ్ జీవిత చక్రం సుమారు 41 నుంచి 45 రోజుల వరకు ఉంటుందని వివరించారు.
పౌల్ట్రీ నిర్వహణలో అయ్యే వ్యయం, విద్యుత్ వినియోగం, కరెంట్ బిల్లులు, దాణా ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు, విక్రయ విధానం వంటి అంశాలను కూడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
సమీకృత వ్యవసాయ విధానంలో ఒకే క్షేత్రంలో పంటల సాగుతో పాటు పౌల్ట్రీ వంటి అనుబంధ కార్యకలాపాలు చేపట్టడం వల్ల ఆదాయ వనరులు పెరుగుతాయని, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ వ్యవసాయాన్ని విభిన్నీకరించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ పరిశీలనలో డీఏఓ అంబికా సోనీ, కేవీకే శాస్త్రవేత్త రమ్య, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.