జనగామ, ఆగస్టు 1, 2026:ప్రపంచ తల్లిపాల వారోత్సవం ప్రతి శిశువుకు ఆరోగ్యవంతమైన జీవితానికి ఉత్తమమైన ప్రారంభాన్ని అందించేందుకు ఒక మంచి అవకాశంగా నిలుస్తుంది. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, పాలిచ్చే తల్లులకు అవసరమైన మద్దతు అందించడం, అనుబంధ పోషకాహార పద్ధతులను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు.
తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి, శారీరక మరియు మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయి. అలాగే అనేక వ్యాధుల నుంచి శిశువును రక్షించడంతో పాటు తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
తల్లిపాల వారోత్సవాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాలు, ఎస్‌హెచ్‌జీల ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. జిల్లాలోని మూడు ICDS ప్రాజెక్టుల పరిధిలోని ప్రతి అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రాల పరిధిలో తల్లులకు తల్లిపాల ప్రాధాన్యత, ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
NFHS-6లో తెలంగాణ పురోగతి
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (2023–24) ఫలితాల ప్రకారం, తెలంగాణలో పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలు ప్రారంభించిన నవజాత శిశువుల శాతం NFHS-5లో 37.1 శాతం నుంచి NFHS-6లో 57.1 శాతానికి పెరిగింది. 50.1% జాతీయ ప్రమాణాన్ని అధిగమించింది.
అదేవిధంగా, ఆరు నెలలలోపు పూర్తిగా తల్లిపాలు పొందిన శిశువుల శాతం 68.2 శాతం నుంచి 64.8 శాతానికి స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ, తెలంగాణలో జాతీయ సగటు అయిన 55.8% కంటే గణనీయంగా ముందుంది.
ఈ నేపధ్యంలో తల్లులకు నిరంతర కౌన్సెలింగ్, కుటుంబ మద్దతు, ప్రవర్తనలో మార్పు, అలాగే తల్లులకు అనుకూలమైన వాతావరణాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించాలి
పుట్టిన ప్రతి శిశువుకు మొదటి గంటలోపే తల్లిపాలు ప్రారంభించడం అత్యంత ముఖ్యమని అధికారులు తెలిపారు. పుట్టిన వెంటనే వచ్చే మురుపాలు (కొలస్ట్రమ్) శిశువుకు తొలి సహజ రక్షణగా పనిచేస్తాయని తెలిపారు, అందులో శిశువుకు అవసరమైన పోషకాలు, రోగనిరోధక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయని వివరించారు.
శిశువు పుట్టినప్పటి నుంచి మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఈ సమయంలో నీరు లేదా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. బిడ్డకు అవసరమైనప్పుడు, పగలు–రాత్రి తేడా లేకుండా తల్లిపాలు ఇవ్వాలని, సాధారణంగా రోజుకు 8 నుంచి 10 సార్లు లేదా ప్రతి 2–3 గంటలకు ఒకసారి పాలివ్వడం మంచిదని సూచించారు.
ఆరు నెలల అనంతరం వయస్సుకు తగిన పోషక విలువలు కలిగిన అనుబంధ ఆహారాన్ని ప్రారంభిస్తూ, రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించాలని తెలిపారు.
తల్లిపాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన, సమతుల్యమైన పోషకాహారాన్ని అందిస్తాయని అధికారులు తెలిపారు. తల్లిపాలలో ఉండే నాణ్యమైన ప్రొటీన్లు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు మరియు ఇతర పోషకాలు శిశువు శారీరక, మానసిక మరియు మెదడు అభివృద్ధికి తోడ్పడతాయి.
తల్లిపాలు శిశువులను డయేరియా, నిమోనియా వంటి అంటువ్యాధుల నుంచి రక్షించడంలో, అలాగే అలర్జీలు, ఆస్తమా వంటి కొన్ని ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. తల్లిపాలు తాగే పిల్లల్లో బాల్యం మరియు యవ్వనంలో అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయి. శిశువుకు అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించడంతో పాటు తల్లి–బిడ్డ మధ్య ప్రేమపూర్వక అనుబంధాన్ని బలోపేతం చేస్తాయి.
అంగన్వాడీ కేంద్రాల స్థాయిలో కార్యక్రమాలు
ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
- గర్భిణులు, బాలింతలు, తల్లులు మరియు కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యతపై కౌన్సెలింగ్.
- పుట్టిన గంటలోపు తల్లిపాలు, మొదటి ఆరు నెలలు ప్రత్యేకంగా తల్లిపాలు, అనుబంధ ఆహారంపై అవగాహన.
- VHSND కార్యక్రమాల్లో తల్లిపాలపై అవగాహన, క్విజ్ మరియు Myth–Fact కార్యక్రమాలు నిర్వహించడం.
- తండ్రులు, తాతమామలు మరియు కుటుంబ సభ్యులతో "తల్లిపాలిచ్చే తల్లులకు కుటుంబ మద్దతు"పై సమావేశాలు.
- అన్నప్రాసన కార్యక్రమాల ద్వారా ఆరు నెలల అనంతరం అనుబంధ ఆహారం ప్రారంభంపై అవగాహన.
- AWTలు, ASHAలు, ANMల సమన్వయంతో నవజాత శిశువులు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు మరియు పోషకాహార లోపం ఉన్న పిల్లల ఇళ్లను సందర్శించి హోమ్ విజిట్ కౌన్సెలింగ్.
- తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగిస్తూ సరైన సమాచారం అందించడం.
- స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు నిర్వహించి శిశు మరియు చిన్నపిల్లల ఆహార పద్ధతులపై (IYCF) అవగాహన కల్పించడం.
ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
తల్లిపాలు ప్రోత్సాహం తల్లి ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని, కుటుంబం, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు, స్వయం సహాయక సంఘాలు, ఆసుపత్రులు, ప్రభుత్వ శాఖలు మరియు సమాజం ఉమ్మడి బాధ్యత అని అధికారులు తెలిపారు.
ప్రతి తల్లికి సరైన సమాచారం, సమయానుకూల కౌన్సెలింగ్ మరియు అనుకూలమైన వాతావరణం కల్పించడం ద్వారా ప్రతి శిశువుకు ఆరోగ్యకరమైన జీవితానికి ఉత్తమమైన ప్రారంభాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.
"తల్లిపాలే శిశువుకు అమృతం – ఆరోగ్యకరమైన జీవితానికి తొలి అడుగు. తల్లిపాలను ప్రోత్సహిద్దాం.. ఆరోగ్యకరమైన తరాన్ని నిర్మిద్దాం."
District Welfare Officer
మహిళా శిశు సంక్షేమ శాఖ, జనగామ జిల్లా