పెద్దపల్లి, ఆగస్టు-1:*ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన, అందుబాటు వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు, వైద్య పరికరాలు, మందులు, మానవ వనరులు సమృద్ధిగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు అధికారులను ఆదేశించారు.
శనివారం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ (హెచ్‌డీఎస్) సమావేశంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని ఆసుపత్రి అభివృద్ధి, వైద్య సేవల విస్తరణ, రోగులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ, గతంతో పోలిస్తే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయని, జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఆసుపత్రి సేవలను వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ సేవల ప్రమాణాన్ని మరింత పెంచేందుకు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆసుపత్రిలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను నిరంతరంగా కొనసాగించాలని, వివిధ రకాల శస్త్రచికిత్సలకు అవసరమైన ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, రోగులకు వైద్యులు సూచించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ ఛార్జీల సవరణ, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలకు అనుమతి, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన మందుల కొనుగోలు, స్పెషలిస్ట్ వైద్యుల నియామకం, ఆరోగ్యశ్రీ బడ్జెట్ సమకూర్చడం, నూతన ఆసుపత్రి భవనం పూర్తైన అనంతరం సీటీ స్కాన్ యంత్రం ఏర్పాటు వంటి అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
నర్సింగ్ సిబ్బంది కొరత నివారణకు చర్యలు చేపట్టాలని, రోగులకు అందించే డైట్ ఫుడ్ నాణ్యతను ప్రతిరోజూ ఆర్‌ఎంఓ పరిశీలించాలని, ఆసుపత్రి పరిశుభ్రతను రోజువారీగా తనిఖీ చేయాలని ఆదేశించారు. శానిటేషన్ సిబ్బంది తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, నర్సింగ్ సిబ్బంది రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
డాక్టర్లు, ఇతర సిబ్బంది విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని, 36 వారాలు దాటిన గర్భిణులను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకుండా తప్పనిసరిగా ఆసుపత్రిలో చేర్చి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో తాగునీటి నాణ్యతను ప్రతి నెల మిషన్ భగీరథ అధికారులతో పరీక్షించించాలని, జిల్లా ప్రారంభ జోక్యం కేంద్రం (డీఈఐసీ) సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. గర్భిణీ స్త్రీలను తీసుకువచ్చే 102 అంబులెన్స్ ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలలోపు ఆసుపత్రికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో పనిచేసే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా గుర్తింపు కార్డు ధరించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు ప్రతి విభాగం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మందులు, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ నిధులను ప్రజలకు నేరుగా ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని తెలిపారు.
ఆసుపత్రి పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రతి వార్డు, ఆపరేషన్ థియేటర్, అత్యవసర విభాగంలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి పట్ల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు సానుభూతితో, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఓపీ, ఐపీ విభాగాల్లో రోగులు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితులు రాకుండా సేవలను సమర్థవంతంగా నిర్వహించాలని, ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
మాతా-శిశు ఆరోగ్య సేవలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, 36 వారాలు దాటిన ప్రతి గర్భిణికి అవసరమైన వైద్య సేవలు అందించి సురక్షిత ప్రసవానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఈఐసీ సేవలను మరింత విస్తరించి చిన్నారులకు అవసరమైన ప్రత్యేక వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని, ఆసుపత్రి సేవలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో
జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కే.శ్రీధర్,
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై. పవిత్ర,
మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కాన్ నాజ్ ,
సెక్రటరీ IRCS పెద్దపల్లి జిల్లా కావేటి రాజగోపాల్,
లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మీసాల సత్యనారాయణ,
ప్రెసిడెంట్ జిల్లా మహిళా సమాఖ్య స్వప్న ,
జిల్లా ఆసుపత్రి RMO డాక్టర్ విజయకుమార్ ,హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు ,పాల్గొన్నారు.