*పెద్దపల్లి, ఆగస్టు-1:* జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తొలి జత పాఠశాల యూనిఫాంలను ఆగస్టు 15 నాటికి తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాల యూనిఫాంల కుట్టింపు, పంపిణీ, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలపై సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తొలి జత యూనిఫాంలను ఈ నెల 15వ తేదీలోగా అందించేలా అన్ని చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని గురుకుల, రెసిడెన్షియల్ విద్యాసంస్థల విద్యార్థులకు ఇప్పటికే యూనిఫాంల పంపిణీ పూర్తయిందని, నిర్ణీత గడువులో నాణ్యమైన యూనిఫాంలను అందించిన స్వయం సహాయక సంఘాల మహిళలను అభినందించారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఎలాంటి జాప్యం లేకుండా యూనిఫాంలు అందించాలని సూచించారు.
స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్థిరత్వానికి బ్యాంక్ లింకేజ్ రుణాల సకాల చెల్లింపులు అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఏ సంఘం కూడా నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా మారకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రతి స్వయం సహాయక సంఘానికి రూ.15 లక్షలకు పైగా బ్యాంక్ లింకేజ్ రుణం లభించేలా అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
సూపర్ ఎల్‌నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామ సంఘం (వి.ఓ) పరిధిలో కనీసం రెండు ఫామ్‌పాండ్లు నిర్మించేలా చర్యలు చేపట్టాలని, ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలి ఇంటిలో ఒక ఇంకుడు గుంత ఉండేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. భూగర్భ జలాల పెంపుకు ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్ల నిర్మాణం ఎంతగానో ఉపయోగపడుతుందని మహిళలకు వివరించాలని ఆదేశించారు.
ప్రతి 10 వేల గ్రూపుల క్లస్టర్‌కు ఒక బుక్‌కీపర్‌ను ఏర్పాటు చేసి వారికి అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ సూచించారు. సంఘాల ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించేందుకు బుక్‌కీపర్ల సామర్థ్యాన్ని మరింత పెంపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు డీఆర్‌డీఏ రవీందర్, స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్ దుర్గాప్రసాద్, ఏపీఎంలు, సెర్ప్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
--------------------------------------------------------------------------------------------------
*జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీ చేయనైన*