పెద్దపల్లి, ఆగస్టు-1: జిల్లాలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు,చేతి పంపులు , బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే లక్ష్యంతో వీబీజీ–రామ్‌జీ (VBG RAM G) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అలాగే వర్షాల నేపథ్యంలో ప్రజలకు కలుషిత రహిత తాగునీరు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు.
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీబీజీ–రామ్‌జీ పథకం అమలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. వీబీజీ–రామ్‌జీ పథకం కింద అవసరమైన అన్ని పరిపాలనా అనుమతులను వెంటనే మంజూరు చేసి, ఆగస్టు నెలలోనే పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీడీఓలు గ్రామాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా తాగునీటి వనరులు కలుషితం కాకుండా మిషన్ భగీరథ అధికారులు ప్రత్యేక అప్రమత్తతతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీటి పైప్‌లైన్లను క్రమం తప్పకుండా పరిశీలించి, అవసరమైన చోట్ల శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు. క్లోరినేషన్ ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో నిరంతరం నిర్వహించి ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలని పేర్కొన్నారు.
అన్ని ఓవర్‌హెడ్ నీటి ట్యాంకులను నిర్దిష్ట వ్యవధిలో శుభ్రపరచాలని, నీటి నిల్వ కేంద్రాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలంలో తాగునీటి కలుషితం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నిర్వహిస్తూ అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామపంచాయతీలు, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రతి గ్రామంలో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడంతో పాటు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఈ.ఈ.మిషన్ భగీరథ ఇంట్రా గంగాధర శ్రీనివాస్, మిషన్ భగీరథ, గ్రామీణాభివృద్ధి, డి.ఈ.లు. ఏ.లు.తదితరులు,పాల్గొన్నారు.
------------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీ చేయనైనది