రాజన్న సిరిసిల్ల, జూలై -31
ఎల్ నినో ప్రభావంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
ఎల్ నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలు, తెలంగాణ జలసిరి పనులు, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, హౌసింగ్ ఏఈలు, ఎంపీడీఓలతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో సాగు విస్తీర్ణం, ప్రస్తుతం ఏ ఏ పంటలు వేశారో ఆరా తీశారు.
అన్ని మండలాల్లో భూగర్భ జలాల పరిస్థితిపై వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన
కల్పించాలని సూచించారు. పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆయిల్ పామ్, పండ్ల తోటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. వాటికి కావలసిన అన్ని విత్తనాలు, మొక్కలు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు సంయుక్తంగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం రైతులకు అవగాహన సమావేశాలు మరిన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు.
ప్రతి కార్యాలయంలో ఉండాలి
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో తెలంగాణ జలసిరి కింద జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్, ఇతర విద్యాలయాల్లో ఇంకుడు గుంతలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి.. పనులు మొదలు పెట్టాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలో అన్ని భవనాలు, ఇండ్లలో ఇంకుడు గుంతలు నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన భవనాల అనుమతిలో ఇంకుడు గుంతలు ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బోర్ వెల్స్ రీచార్జ్ పనులు ముమ్మరంగా చేయించాలని తెలిపారు. భూ గర్భ జలాల లభ్యత, భవిష్యత్తు అవసరాలపై రైతులకు వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు సంయుక్తంగా అవగాహన కల్పించి.. ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంట కుంటలు (పామ్ పాండ్), ఊట కుంట (పర్కొలేషన్ ట్యాంక్) పూర్తి చేయాలని ఆదేశించారు. వాన నీటిని సంరక్షిస్తే భవిష్యత్ లో ఎంతో మేలు చేకూరుతుందని,
భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని తెలిపారు.
లక్ష్యాలను సాధించేలా చర్యలు చేపట్టాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలో మొదటి దశలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ప్రస్తుత పరిస్థితి, ప్రారంభమైన నిర్మాణాలు, పూర్తయిన ఇండ్ల వివరాలను మండలాల వారీగా అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.
రెండో దశలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక, అర్హత కలిగిన లబ్ధిదారుల వివరాలను ఆరా తీశారు.
ఇండ్ల నిర్మాణాల కోసం లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, నిర్మాణ సామగ్రి అందుబాటులో పెట్టడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ. సహకారం అందించాలని సూచించారు. ప్రతి ఇంటి నిర్మాణం వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
టెలీ కాన్ఫరెన్స్ లో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పంచాయతీ అధికారి జయశీల అధికారులు ఉన్నారు.