జూలై 31
జనగామ
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా జనగామ జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) ప్రక్రియపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 99.79 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడంతో రాష్ట్రవ్యాప్తంగా జనగామ జిల్లా తొలి స్థానంలో ఉందని పేర్కొన్నారు.
ఓటరు జాబితా మరింత ఖచ్చితత్వంతో, పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ ప్రక్రియలో నమోదు చేసిన ప్రతి వివరాన్ని నిబంధనలకు అనుగుణంగా పరిశీలిస్తూ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) ప్రక్రియపై సమగ్రంగా వివరించారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి మించి ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఓటరు సులభంగా చేరుకునే విధంగా రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అలాగే, ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో నమోదు కాకుండా అందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ఫ్యామిలీ కార్డ్ ఆధారంగా కుటుంబ వివరాలను సమగ్రంగా పరిశీలిస్తూ, అవసరమైన మార్పులు చేపట్టాలని వివరించారు.
జిల్లాలో నివాసం మార్చుకున్న షిఫ్టెడ్ ఓటర్ల వివరాలను కూడా ప్రత్యేకంగా గుర్తించి, వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అనుగుణంగా ఓటరు జాబితాలో అవసరమైన సవరణలు చేపట్టాలని తెలిపారు. దీని ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునే అవకాశం కల్పించడమే లక్ష్యమన్నారు.
ప్రస్తుతం జిల్లాలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న 13 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వాటి రేషనలైజేషన్ (హేతుబద్ధీకరణ) ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.
ఈ సమీక్ష సమావేశంలో జనగామ, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి రావెల రవి, బీజేపీ పార్టీ ప్రతినిధి పి. జగదీశ్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు బి. భాస్కర్, యు. రవి యాదవ్, సీపీఎం పార్టీ ప్రతినిధి జోగు ప్రకాష్, టీడీపీ పార్టీ ప్రతినిధి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.