రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల హాస్టల్‌ను జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, వంటశాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షితమైన తాగునీటిని మాత్రమే వినియోగించడం, జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. హాస్టల్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం వేములవాడ పట్టణంలోని సాయినగర్‌లో నిర్వహిస్తున్న డ్రై డే కార్యక్రమాలను డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ నీటి నిల్వ పాత్రలను ఖాళీ చేసి శుభ్రపరచాలని సూచించారు.
డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. ఇంటి పరిసరాల్లో కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, కూలర్లు, పూల కుండీలు, నీటి డబ్బాలు వంటి వాటిలో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ డ్రై డే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక హెల్త్ సూపర్ వైజర్, ఆశా కార్యకర్తలు, ANMలు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
రాజన్న సిరిసిల్ల