జూలై 24
జనగామ
*గణితం ప్రత్యేకమైన సబ్జెక్ట్ – మాథ్స్‌లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకూడదు*
*ఉపాధ్యాయులు ప్రతి అంశంపై ముందుగానే సన్నద్ధమై ఆసక్తితో బోధిస్తేనే ఉత్తమ ఫలితాలు*
*విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టే బాధ్యత ఉపాధ్యాయులదే*
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
గణితం ప్రత్యేకమైన సబ్జెక్ట్ అని, ఈ విద్యా సంవత్సరంలో మాథ్స్‌లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సూచించారు.
శుక్రవారం, జిల్లాలోని లింగాల ఘనపురం మండలంలోని నెల్లుట్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* ఆకస్మికంగా సందర్శించి, పరిశీలించారు.
ఆధునిక బోధన–అభ్యాసన పద్ధతులపై జరుగుతున్న శిక్షణలో పాల్గొన్న గణిత ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడి, పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఆల్జీబ్రా, లాగరిథమ్స్, పాలినామియల్ ఈక్వేషన్స్‌కు సంబంధించిన సమస్యలను ఇచ్చి, వాటి పరిష్కార విధానాన్ని వివరించాలని సూచించారు.
గణితంలోని ప్రతి అంశాన్ని కేవలం సూత్రాలకే పరిమితం కాకుండా, విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే విధంగా విజువలైజేషన్ (దృశ్యీకరణ) పద్ధతిలో బోధించాలని తెలిపారు.
ఉపాధ్యాయులు ప్రతి అంశంపై సన్నద్ధమై తరగతి గదికి వస్తే బోధన నాణ్యత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అకాడమిక్ ఫ్రేమ్‌వర్క్‌ను తప్పనిసరిగా పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా బోధన కొనసాగించాలని సూచించారు.
ప్రతి 15 రోజులకు స్లిప్ టెస్టులు, మాక్ టెస్టులు నిర్వహించి, విద్యార్థుల అభ్యాస స్థాయిని నిరంతరం అంచనా వేయాలని ఆదేశించారు.
ఈసారి పదో తరగతి పరీక్షల్లో గణితంలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని, ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా లక్ష్యంతో కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
"మీరు ఎలా బోధిస్తారో ఫలితాలు కూడా అలాగే వస్తాయి. విద్యార్థుల్లో బాగా చదివేవారు, వెనుకబడినవారు ఇద్దరూ ఉంటారు. ఉపాధ్యాయులు అదనపు శ్రద్ధ, ప్రత్యేక కృషి చూపితే ప్రతి విద్యార్థిని ఒకే స్థాయికి తీసుకురావచ్చు" అని *కలెక్టర్* పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఫాస్ట్ మాథ్స్ పుస్తకంలోని అంశాలను తప్పనిసరిగా బోధించాలని, గణితంపై విద్యార్థుల్లో భయాన్ని తొలగించి, ఆసక్తిని పెంపొందించేలా సృజనాత్మక బోధనా విధానాలను అనుసరించాలని సూచించారు.
శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులతో *కలెక్టర్* పలు గణిత అంశాలపై చర్చించి, నాణ్యమైన బోధన ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఉన్నత ఫలితాల దిశగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.