*కామారెడ్డి ZP CEO పై మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం.. కేసు నమోదు!*
ప్రభుత్వ నిధుల అవినీతిని ప్రశ్నించినందుకు గాను సామాజిక కార్యకర్త గుర్జాల మధుసూదన్ రెడ్డికి ఫోన్ చేసి ప్రాణ బెదిరింపులకు దిగిన కామారెడ్డి ZP CEO వ్యవహారంలో మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై బాధితుడు సమర్పించిన ఆధారాలు, ఆడియో రికార్డింగ్‌ను పరిశీలించిన *తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అధికారికంగా కేసు నమోదు చేసింది (Case No. 2980/36/8/2026).*
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామంలో రూ. 4,05,036/- ల ప్రజాధనం డబుల్ బిల్లింగ్ ద్వారా కాజేసినట్లు సామాజిక కార్యకర్త మధుసూదన్ రెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేయగా, కలెక్టరేట్ విచారణలో అవినీతి నిరూపితమై సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే, బాధ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలని వినతిపత్రం ఇవ్వడంతో, క్రిమినల్ కేసుల భయంతో ZP CEO ఫోన్ చేసి
* ఉద్యోగం వదిలేసి నిన్ను రాత్రికి రాత్రే బొంద పెట్టిస్తా
* కాళ్లు చేతులు తీయిస్తా
* అట్రోసిటీ కేసు పెట్టి జైల్లో తోయిస్తా అంటూ తీవ్ర బెదిరింపులకు దిగారు.
ప్రాణ రక్షణ మరియు పౌర హక్కుల భంగానికి గురైన బాధితుడు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, కమిషన్ సదరు కేసును స్వీకరించి విచారణ చేపట్టింది. బాధితుడి ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ, బెదిరింపులకు దిగిన ఉన్నతాధికారిపై తక్షణమే సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషన్ అధికారులను ఆదేశించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఒక ఉన్నతాధికారి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించిన సామాజిక కార్యకర్తపై ఈ స్థాయిలో ప్రవర్తించడంపై హెచ్‌ఆర్‌సీ కేసు నమోదు చేయడంతో జిల్లా యంత్రాంగం మరియు విచారణ ఎదుర్కొంటున్న అధికారుల్లో తీవ్ర కలకలం రేగుతోంది. బెదిరింపులకు దిగిన అధికారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసే వరకు తమ పోరాటం ఆగదని మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.