రాజన్న సిరిసిల్ల, జూలై -23
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలోని రైతులందరికీ
గ్రామసభల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
గురువారం ఉదయం ఎల్‌నినో ప్రభావంపై రైతులతో గ్రామసభలు నిర్వహించడం, జలసిరి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనుల గ్రౌండింగ్, పురోగతి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయడంపై వ్యవసాయ, పంచాయతీ రాజ్, గృహనిర్మాణ శాఖల అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల పురోగతిని మండలాల వారీగా తెలుసుకుని, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతు గ్రామ సభల ద్వారా జిల్లాలోని రైతులందరికీ ప్రత్యామ్నాయ పంటల సాగు, వర్షపాతం లోటు, భూగర్భ జలాల తగ్గుదల, రిజర్వాయర్లలో వర్షం నీటి సంరక్షణపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి మండల ప్రత్యేక అధికారి వారానికి కనీసం రెండు గ్రామసభలకు హాజరై రైతులతో నేరుగా మాట్లాడాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులతో సమన్వయం చేసుకుంటూ ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని, ఆయా పంటలకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్న విషయాన్ని రైతులకు తెలియజేయాలని ఆదేశించారు.
జలసిరి కార్యక్రమంలో భాగంగా రూపొందించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం పనులను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
ఫామ్ పాండ్లు, బోర్‌వెల్ రీచార్జ్, ఇతర అన్ని నీటి సంరక్షణ పనులను పెద్ద సంఖ్యలో గ్రౌండింగ్ చేసి, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
మండలాల వారీగా పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరిగేలా చూడాలని, జలసిరి పనులకు సంబంధించి నూతన ప్రతిపాదనలను త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల వారీగా మంజూరైన ఇండ్లు, నిర్మాణాల ప్రస్తుత స్థితిగతులు, పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మొదటి దశలో మంజూరైన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని, రెండవ విడతలో అర్హులైన, ఇండ్లు నిర్మించుకునేందుకు ఆసక్తిగా ఉన్న లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గుడిసెలు, రేకుల ఇళ్లలో నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని, నిర్మాణంలో ఉన్న ఇండ్ల పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
టెలీ కాన్ఫరెన్స్ లో హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీఏఓ అఫ్జల్ బేగం, ఎంపీడీఓ లు, మండల వ్యవసాయ అధికారులు, హౌసింగ్ డీఈ, ఏఈ లు, ఏపీఓలు, పాల్గొన్నారు.