*గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయాలి*
*ఆర్థిక సంఘం నిధులు, వీబీజీ రాంజీని సద్వినియోగం చేసుకోవాలి*
*తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి*
*ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ పక్కాగా వసూలు చేయాలి*
*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*
*గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సిరిసిల్లలో శిక్షణ*
---------------------------------
రాజన్న సిరిసిల్ల, జూలై -10
---------------------------------
జిల్లాలోని ప్రతి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ఇల్లంతకుంట, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. నాలుగు రకాల చెత్త బుట్టలు ప్రదర్శనలో పెట్టారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..
జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ గ్రామ జనాభా, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించారు. పాఠశాలలో కనీస వసతుల కల్పన, గ్రామంలో మురుగునీటి కాలువలు, ఇతర మౌలిక వసతులు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు నిబంధనల ప్రకారం వినియోగించాలని తెలిపారు. వీబీజీ రాంజీ కింద వివిధ పనులు చేసుకునే అవకాశం ఉందని, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఎస్సీ కార్పొరేషన్ ఇతర ప్రభుత్వ శాఖలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కింద గ్రామాభివృద్ధికి సంబంధించిన పథకాల వివరాలు తెలుసుకొని దానికి అనుగుణంగా తమ గ్రామంలో పనులు చేసుకోవాలని తెలిపారు. వీబీ జీ రాంజీ కింద ప్రతి వర్షం నీటి బొట్టు భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతలు, నీటి వనరుల సంరక్షణ, మొక్కల పెంపకం, ఇతర పనులు చేసుకోవచ్చని తెలిపారు. శ్రీ నిధి కింద స్వయం ఉపాధి పథకాలు అమలు చేసే అవకాశం ఉందని వివరించారు.
గ్రామంలోని నీటి ట్యాంకును శుభ్రం చేయించాలని, మురుకు కాలువలు నిత్యం శుభ్రం చేయించాలని, నీటి సరఫరాను చేయించాలని, ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించి సెగ్రిగేషన్ షెడ్ కు తరలించాలని ఆదేశించారు. వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు టైఫాయిడ్, డెంగ్యూ నియంత్రణ సాధ్యమని వెల్లడించారు.
సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామంలోని ఆయా ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రతి ఇంట్లో మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించేలా చూడాలని గ్రామ స్థాయి అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని నిల్వ నీటిని పారబోయాలని సూచించారు. వర్షం కురిసిన మరుసటి రోజు సైతం నీరు నిలువ ఉన్న చోట బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి నాలుగు రకాల చెత్త బుట్టలు ఇవ్వాలని, దానికి అనుగుణంగా చెత్తను సేకరించాలని తెలిపారు.
మంచినీటి లోనే డెంగ్యూ దోమలు పెరుగుతాయని తెలిపారు. సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించి పారిశుధ్య పనులు పక్కాగా చేయించాలని ఆదేశించారు. గ్రామంలోని ఫాగింగ్ మిషన్ తో నిత్యం అన్ని వార్డుల్లో ఫాగింగ్ చేయించాలని తెలిపారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించే వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు. అయినా తీరు మారకపోతే జరిమానా విధించాలని ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు వివిధ గ్రాంట్లు గ్రామపంచాయతీ అభివృద్ధి, వివిధ పనులకు మంజూరు అవుతాయని వెల్లడించారు. గ్రామపంచాయతీ సైతం తమ పరిధిలోని అన్ని ఇళ్ల నుంచి ఇంటి పన్ను వసూలు చేయాలని, అన్ని వ్యాపార సముదాయాల నుంచి ట్రేడ్ లైసెన్స్ వసూలు చేయాలని స్పష్టం చేశారు.
ఎల్ నినో నేపథ్యంలో వర్షపాతం తక్కువ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. దీనికి అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు సూచన మేరకు రైతులు పంటలు సాగు చేసేలా సూచనలు చేయాలని పేర్కొన్నారు. స్వల్ప కాలిక పంటలు కూరగాయలు, పప్పు ధాన్యాలు,ఆయిల్ ఫామ్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని తెలిపారు.
సమావేశంలో జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, మిషన్ భగీరథ ఈఈ అన్వర్, ఆయా మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.