టి ప్రభాత దర్శిని కామారెడ్డి ప్రతినిధి. కరుణాకర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా IDOC ప్రాంగణంలో DMFC(T) నిధుల ద్వారా నిర్మించిన నీటి నిల్వ చెరువును జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు , పర్యావరణ పరిరక్షణకు నీటి నిల్వ చెరువులు ఎంతో దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వర్షపు నీటిని సద్వినియోగం చేసేందుకు ఇటువంటి చర్యలు చేపట్టడం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
DMFC(T) నిధుల నుంచి రూ.6.55 లక్షల వ్యయంతో ఈ నీటి నిల్వ చెరువును నిర్మించినట్లు తెలిపారు. వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాల మట్టాన్ని పెంచడంతో పాటు పర్యావరణ సమతుల్యతకు ఇది ఉపయోగపడుతుందని కలెక్టర్ వివరించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ నీటి నిల్వ చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెరువు చుట్టూ పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. పరిసరాలను పచ్చదనంతో అభివృద్ధి చేయడం ద్వారా కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించవచ్చని తెలిపారు.
నీటి నిల్వ చెరువు పరిసర ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో బతుకమ్మ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలను కూడా ఇక్కడ నిర్వహించుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఇంచార్జి అదనపు కలెక్టర్ NV గిరి, DRDO దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.