పెద్దపల్లి, మే - 20: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సామాజిక సేవలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
బుధవారం జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పార్లమెంట్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు,రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మార్గదర్శనంలో, రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ నాయకత్వంలో బహుముఖ సేవలందిస్తున్న అతి పెద్ద సంస్థ అని కలెక్టర్ పేర్కొన్నారు. మే15 నుండి జూన్ 15, 2026 వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించబడుతుందని, రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం, ఉచిత స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, క్యాన్సర్, సికిల్ సెల్, తలసేమియా రోగులకు ఉచిత రక్తాన్ని అందించడం, సీనియర్ సిటిజన్స్ హోమ్స్, అనాథ శరణాలయాలు, ఉచిత ప్రసూతి వైద్యశాలల నిర్వహణ వంటి ఎన్నో అద్భుతమైన సామాజిక సేవలు అందుతున్నాయని కలెక్టర్ వివరించారు.
అనంతరం పెద్దపల్లి మండలం కొత్తపల్లికి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కనుకుంట్ల సదానందం కు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వాన్ని జిల్లా కలెక్టర్ అందించారు.
18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఈ సంస్థలో సభ్యుడిగా చేరుటకు అర్హుడని, ఆసక్తి గలవారు ఆన్‌లైన్ ద్వారా జీవిత / వైస్ ప్యాట్రన్ / ప్యాట్రన్ సభ్యునిగా చేరవచ్చని సూచించారు. సభ్యత్వ నమోదు కొరకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్ నిమిత్తం ఆధార్ కార్డు / ఓటర్ ఐడి కార్డ్ / పాన్ కార్డ్ అవసరమవుతాయని తెలిపారు.
సభ్యులుగా చేరదలచిన వారు అధికారిక వెబ్సైట్ https://redcross.cgg.gov.in/ ద్వారా గానీ, లేదా గూగుల్ ప్లే స్టోర్ నుండి Telangana Red Cross మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని గానీ నమోదు చేసుకోవచ్చని, జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు నోడల్ ఆఫీసర్లుగా జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ / డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ / ప్రాజెక్ట్ డైరెక్టర్ గ్రామీణ అభివృద్ధి అధికారిని నియమించామని, వారి కార్యాలయాల్లో ప్రత్యేకంగా డాటా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా అడిషనల్ కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రెగ్యులర్ గా సమీక్షిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం జిల్లా యువజన క్రీడా శాఖ కార్యాలయంలో టూరిజం గైడ్ పోస్టర్ ను జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి, ఉపాధి కల్పనాధికారి ,రాజశేఖర్, సహాయ కార్మిక అధికారి మహమ్మద్ రఫీ
రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు కావేటి రాజగోపాల్, తదితరులు, పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.