*తల్లిదండ్రుల భాగస్వామ్యంతోనే విద్యార్థుల ప్రగతి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*రానున్న ఆరు నెలల్లో పాఠశాలల మౌలిక వసతుల పనులు పూర్తి*
*ప్రతి తల్లిదండ్రులు పేరెంట్–టీచర్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి*
*తుర్కల మద్దికుంట ఎంపీపీ ఎస్ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్*
------------------------------
*పెద్దపల్లి, జూలై-18:*
-----------------------------
విద్యార్థుల విద్యా ప్రగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అత్యంత కీలకమని, తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన ప్రతిభ కనబరుస్తారని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* తెలిపారు.
శనివారం పెద్దపల్లి మండలంలోని తుర్కల మద్దికుంట ఎంపీపీ ఎస్ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* పాల్గొని పాఠశాలలో చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, తల్లిదండ్రుల బాధ్యతలపై పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తుర్కల మద్దికుంట ఎంపీపీ ఎస్ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయిందని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన మౌలిక వసతుల పనులన్నింటినీ రానున్న ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడంపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ లక్ష్యం సాధించడంలో తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని, ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా పేరెంట్–టీచర్ సమావేశాలకు హాజరై తమ పిల్లల చదువు, ప్రగతి గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.
విద్యార్థులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చూడాలని కలెక్టర్ తెలిపారు. ఏదైనా కారణంతో కొద్ది రోజులు పాఠశాలకు రాలేకపోతే వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని, తద్వారా వారు మిస్సైన పాఠాలను ప్రత్యేకంగా బోధించే అవకాశం ఉంటుందని అన్నారు.
ప్రతి రోజు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొంత సమయం పిల్లలతో గడపాలని, పాఠశాలలో ఏమి నేర్చుకున్నారో, హోంవర్క్ ఇచ్చారా అని అడిగి తెలుసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ హోంవర్క్ పూర్తి చేసేలా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని కోరారు.
తల్లిదండ్రులు ఎప్పుడైనా పాఠశాలకు వచ్చి తమ పిల్లల విద్యా పురోగతి, ప్రవర్తన గురించి ఉపాధ్యాయులను సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సంపూర్ణ సహకారం లభిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని జిల్లా కలెక్టర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డి.ఈ.ఓ. శారద, జి.సి.డి.ఓ. కవిత, సర్పంచ్ రాజయ్య, ఉప సర్పంచ్ తిరుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజు లత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ,తదితరులు, పాల్గొన్నారు.