Banner
Watermark
ఫోరెన్సిక్ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలి.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
📅 14 August 2026, 02:16 PM ✍️ admin
News Image
*పెద్దపల్లి, ఆగస్టు-14:* రామగుండం ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ విభాగం ద్వారా ప్రజలకు, పోలీసు శాఖకు, న్యాయవ్యవస్థకు సకాలంలో నాణ్యమైన మెడికో-లీగల్ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ విభాగంలో ప్రతి నెల సుమారు 30 మెడికో-లీగల్ పోస్టుమార్టంలు నిర్వహిస్తున్నారని, ఇందులో పలు క్లిష్టమైన, సవాళ్లతో కూడిన కేసులు కూడా ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఫోరెన్సిక్ వైద్యులు శాస్త్రీయ పద్ధతుల్లో, నిష్పక్షపాతంగా, సకాలంలో పోస్టుమార్టంలు నిర్వహిస్తూ పోలీసు శాఖ దర్యాప్తులో, న్యాయవ్యవస్థలో న్యాయం జరిగే ప్రక్రియలో కీలక సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన సందర్భాల్లో, ముఖ్యంగా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు, అత్యవసర పరిస్థితుల్లో రాత్రి వేళల్లో కూడా పోస్టుమార్టంలు నిర్వహిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా మెడికో-లీగల్ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మోర్చరీలో సౌకర్యాలను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా పునరుద్ధరణ పనులు చేపట్టి, సరైన లైటింగ్‌తో పాటు ఇతర అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా, శాస్త్రీయంగా నిర్వహించేందుకు కొత్త డిసెక్షన్ టేబుళ్లను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మృతదేహాలను సురక్షితంగా, గౌరవప్రదంగా భద్రపరిచేందుకు *4 కోల్డ్ ఫ్రీజర్ బాక్సులను మంజూరు చేసి మోర్చరీకి అందజేసినట్లు* తెలిపారు. ఈ అదనపు సదుపాయాలు మృతదేహాల గౌరవం, భద్రత, సంరక్షణను కాపాడటంతో పాటు పోస్టుమార్టం ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడతాయని అన్నారు.

మెరుగైన మోర్చరీ సదుపాయాలతో ప్రజలకు, పోలీసు శాఖకు, న్యాయవ్యవస్థకు సకాలంలో నాణ్యమైన మెడికో-లీగల్ సేవలు అందించేందుకు మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని తెలిపారు.ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ విభాగం న్యాయ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నందున, శాస్త్రీయ పద్ధతులు, నిష్పక్షపాత విధానం, సకాలంలో సేవలందించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
-----------------------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home