Banner
Watermark
నిరాధార ఫిర్యాదులు, తప్పుడు ప్రచారాన్ని ఉపేక్షించం.....జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
📅 14 August 2026, 02:14 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, ఆగస్టు-14: అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు.

సామాజిక కార్యకర్తగా చెప్పుకునే పెద్దపల్లి మండలం రాఘవపూర్ కు చెందిన బొబ్బిలి సత్యనారాయణ అధికారులను అనవసరంగా అప్రతిష్ఠపాలు చేసే విధంగా లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పెద్దపల్లి
రాఘవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఏల్లమ్మ ఆలయ నిర్మాణానికి సరైన అనుమతులు లేవంటూ బొబ్బిలి సత్యనారాయణ 02.01.2023న లోకాయుక్త కు ఫిర్యాదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, అవసరమైన వివరాలతో కూడిన నివేదికను లోకాయుక్తకు సమర్పించినట్లు పేర్కొన్నారు.
అధికారులు సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం, బొబ్బిలి సత్యనారాయణ దాఖలు చేసిన ఫిర్యాదు నిరాధారమైనది, వేధింపులకు ఉద్దేశించినదిగా లోకాయుక్త పేర్కొంటూ 22.12.2025న ఫిర్యాదును కొట్టివేసిందని కలెక్టర్ తెలిపారు.

తప్పుడు, నిరాధార ఫిర్యాదు ద్వారా లోకాయుక్త సంస్థ సమయంతో పాటు ప్రభుత్వ అధికారుల విలువైన సమయాన్ని కూడా వృథా చేసినందుకు తెలంగాణ లోకాయుక్త చట్టంలోని సెక్షన్ 13-A కింద రూ.10,000 జరిమానా విధించినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

లోకాయుక్త ఆదేశాల మేరకు రూ.10,000 జరిమానాను రెవెన్యూ రికవరీ చట్టం కింద బొబ్బిలి సత్యనారాయణ నుంచి వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిలో జమ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రజా సమస్యలపై వాస్తవాధారాలతో ఫిర్యాదులు చేయడాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందని, అయితే వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా ప్రభుత్వ అధికారులను అప్రతిష్ఠపాలు చేయాలనే ఉద్దేశంతో నిరాధార ఆరోపణలు చేయడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని జిల్లా కలెక్టర్ అన్నారు.

అధికారులపై తప్పుడు వార్తలు, నిరాధార ఆరోపణలు వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ఎవరినీ ఉపేక్షించబోమని, అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
----------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీ చేయనైనది.
🏠 Home